పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేవారు అప్పటితరం పెద్దలు. ఇప్పుడు సినిమా తీసి చూడు.. తీసిన సినిమాని విడుదల చేసి చూపించు” అంటున్నారు. ఒక సినిమాను నిర్మించడం కంటే.. సదరు సినిమాను విడుదల చేయడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది దర్శకనిర్మాతలకు. అసలే థియేటర్ రెంట్లు, క్యూబ్ రెంట్లు అంటూ కట్టలేక బాధపడుతుంటే.. ఇప్పుడు కొత్తగా ప్రమోషనల్ ఏజెన్సీలు వచ్చి.. నిర్మాతలను ఏడిపిస్తున్నాయి.
సినిమాను జనాల్లోకి తీసుకెళ్తాం, సోషల్ మీడియా పబ్లిసిటీకి ఇంత కావాలి, యూట్యూబ్ పబ్లిసిటీకి ఇంత, ట్విట్టర్ ప్రమోషన్స్ కి ఇంత అని నిర్మాతల దగ్గర దారుణంగా డబ్బులు గుంజుతున్నారు ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ బ్యాచ్.ఖర్చు అయితే అయ్యిందిలే.. సినిమా జనాలకి రీచ్ అవ్వడం ముఖ్యం కదా అని నిర్మాతలు ఖర్చుపెడుతున్నప్పటికీ.. కలెక్షన్స్ లో కానీ ఓపెనింగ్స్ లో కానీ సదరు సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల ఉపయోగం ఏమిటి అనేది కనిపించడం లేదు. ఈ కారణంగా నిర్మాతలు సోషల్ మీడియా ప్రమోషన్స్ అంటేనే బిత్తరపోతున్నారు. సొ ఈ స్ట్రాటజిస్టులు దయచేసి.. ఉన్న కొద్దిపాటి నిర్మాతలను భయపెట్టి పారిపోయేలా చేయకుండా.. కాస్త ఎంకరేజ్ చేస్తే బెటర్. లేదంటే కొన్నాళ్ళకి నిర్మాతలను వెతుక్కోవాల్సి వస్తుంది.