హీరో నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. ఆయన్ని దారుణంగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం నానిని టార్గెట్ చేస్తూ చాలా హడావిడి చేసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ప్రతీసారి ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటాయనే ఆలోచన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల్లో కలుగుతుంది. అందుకే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
”సినిమా అనేది థియేటర్లో ప్రదర్శన కోసమే తయారవుతుంది. అందులో సందేహం లేదు. కానీ సమయాన్ని బట్టి సినిమాను ఎక్కడ వేయాలనేది నిర్మాత నిర్ణయించుకుంటారు తప్ప.. అతడిని ఒత్తిడికి గురి చేసి ఇలాగే చేయాలని ఎవరూ శాసించడానికి లేదు. సినిమాపై పెట్టుబడి పెట్టేది నిర్మాత. కష్టం, నష్టం భరించేది కూడా నిర్మాతే. సినిమాను ఎవరికి అమ్మాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. థియేటర్ కు వెసులుబాటు లేకపోతే.. కష్టం, నష్టం భరించే స్థోమత నిర్మాతకు లేకపోతే ఓటీటీకి వెళ్లక తప్పదు.
అలా అని చెప్పి హీరోనో, ఇతర ఆర్టిస్ట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. నిర్మాతలకు నష్టం వస్తే ఎవరు భరిస్తారు..? ఇప్పుడు విమర్శలు చేసిన వారు భరిస్తారా..?” ఇది గిల్డ్ సభ్యుల వెర్షన్. ఇప్పుడు ఈ అభిప్రాయాన్నే వాళ్లు అఫీషియల్ గా గిల్డ్ తరఫున కౌంటర్ గా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయమై గిల్డ్ యాక్టివ్ సభ్యుడు భోగవిల్లి బాపినీడుని ప్రశ్నించగా.. ఈరోజు నిర్ణయం తీసుకుంటామని.. సభ్యులంతా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.