కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బాగా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి సామాన్యులు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ తర్వాత సినిమాల మేకింగ్ కాస్ట్ మాత్రమే కాదు..నటీనటుల పారితోషికాలు కూడా పెరిగిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ఓ సినిమాని రూపొందించాలి అంటే చాలా కాలిక్యులేషన్ తో వ్యవహరించాలి. కానీ ఈ మధ్య ఫిలిం మేకర్స్ లో అది కనిపించడం లేదు.
అందువల్లనే చిన్న సినిమాల బడ్జెట్ లు కూడా శృతిమించిపోతున్నాయి. ఉదాహరణకి సత్యదేవ్ (Satya Dev) విషయానికి వద్దాం. అతని కెరీర్లో.. అదీ హీరోగా చేసిన సినిమాల్లో థియేట్రికల్ హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఓటీటీ మార్కెట్ కొంతవరకు ఉంది. అది కూడా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) సినిమా వర్కౌట్ అయ్యింది కాబట్టి.. మినిమమ్ బడ్జెట్లో కనుక సినిమా తీస్తే.. ఓటీటీల రూపంలో ఇతని సినిమాలకు 60 శాతం రికవరీ జరుగుతుంది.
అది మర్చిపోయి సత్యదేవ్ తో సినిమా తీస్తున్న ఓ నిర్మాత భారీగా ఖర్చుపెట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్యదేవ్ హీరోగా ‘జీబ్రా’ అనే సినిమా రూపొందుతుంది. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ‘ఓల్డ్ టౌన్ పిక్చర్స్’ బ్యానర్ల పై ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ‘జీబ్రా’కి సంబంధించి ఓ మోషన్ పోస్టర్ ను వదిలారు.
ఇందులో సత్యదేవ్ తో పాటు సత్యరాజ్(Satyaraj), సునీల్ (Sunil), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar).. వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ.25 కోట్లు బడ్జెట్ పెట్టేశారట. అంత బడ్జెట్ అయిపోవడంతో.. ఇప్పుడు బిజినెస్ చేసుకోవడం నిర్మాతలకి బాగా కష్టమవుతుంది అని తెలుస్తుంది. కథ డిమాండ్ చేసినంతవరకు బడ్జెట్ పెట్టాలి కరెక్టే… కానీ మార్కెట్ లేని హీరోకి సూట్ అవ్వని కథలతో సినిమాలు చేయడం కూడా తప్పే అని ‘జీబ్రా’ తో ప్రూవ్ అయ్యింది.