సినిమాల్లో తన హీరోలకు ఒకటి, రెండు లైన్ల పంచ్ డైలాగ్‌లు రాసే పూరి జగన్నాథ్… ‘మ్యూజింగ్స్’ వీడియోలకు మాత్రం పెద్ద పెద్ద స్టోరీలే రాస్తున్నారు. రెండు ముక్కల్లో జీవిత సత్యాలు చెప్పే ఈ పెద్ద స్టోరీలో మనుషుల అలవాట్లు, మారుతున్న పరిస్థితులు చెబుతూ వస్తున్నారు. తాజాగా మాంసం వినియోగం, కృత్రిమ మాంసం తయారీ తదితర విషయాల గురించి మాట్లాడారు. ‘ప్రపంచానికి కసాయివాడు కావాలి’ అంటూ మొదలు పెట్టి… 2040లో ప్రపంచం ఏ మాంసం తింటుందో చెప్పేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే…
‘‘నాన్‌వెజ్ తినమంటే లొట్టలేసుకుంటూ తింటారు కానీ… కోడిని కోయమంటే కోయలేరు. అందుకే ఈ ప్రపంచానికెప్పుడూ కసాయివాడు కావాలి. ఆహారం కోసం చేపలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు… ఇలా అన్నీ కలిపి రోజుకు 300 కోట్ల జంతువులను చంపుతున్నాం. అయితే త్వరలో మాంసం కోసం ఏ జంతువునూ చంపాల్సిన అవసరం లేదు. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ‘కల్చరింగ్ మాంసం’ అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఆ పద్ధతిలో ఏ జంతువును పెంచాల్సిన అవసరం లేదు. చంపాల్సిన అవసరమూ లేదు. ల్యాబ్‌లో మీకు కావాల్సిన మాంసాన్ని తయారు చేయొచ్చు. కావాల్సిన మాంసం కణాలతో బయో రియాక్టర్స్‌లో తయారు చేస్తారు. వాటికి మొక్కల ఆధారిత పోషక పదార్థాలను జోడిస్తారు కూడా’’ అని కృత్రిమ మాంసం గురించి చెప్పారు పూరి.
‘‘తయారు చేసుకున్న మాంసాన్ని అమ్మకాలకు ఇటీవల కొన్ని దేశాల్లో ప్రభుత్వాల అనుమతులు వచ్చేశాయి. ఇటీవల సింగపూర్‌లోని ఓ రెస్టరెంట్‌లో తాజాగా దీనిని మొదలుపెట్టారు. అయితే నాకు కోడి కాళ్లు కావాలి, గుండెకాయ కావాలంటే కుదరదు. త్వరలో అన్ని దేశాల్లో ఈ తరహా మాంసం అందుబాటులోకి వస్తుంది. ల్యాబ్‌లో పెంచే మాంసం, మొక్కల ఆధారితమైనది. కాబట్టి శాకాహారులు కూడా తినొచ్చు. సింగపూర్‌లో 10 వేల లీటర్ల బయో రియాక్టర్లను వాడుతున్నారు. త్వరలో 50,000 లీటర్లకు పెంచుతున్నారు. దాంతో మొత్తం సింగపూర్‌కు మాంసాన్ని అందించొచ్చు. 2040 నాటి కల్లా మనుషులు తినే మాంసం మొత్తం ఇదే ఉంటుంది’’ అని పూరి తెలిపారు.