ఇండియన్ సినిమాను కొత్త మలుపుకు తీసుకెళ్లిన శంకర్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు విజయాల సునామీ సృష్టించిన ఈ దర్శకులు, వరుస పరాజయాలతో బాగా వెనుకబడ్డారు. వారి సినిమాలకు కావాల్సిన గ్రిప్ లేకపోవడంతో, ఈ దశలో బౌన్స్ బ్యాక్ సాధించడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శంకర్ “గేమ్ ఛేంజర్” ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు స్టోరీ కార్తీక్ సుబ్బరాజ్ అందించడంతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో వివేక్ వేళుమురగన్‌పై ఆధారపడ్డారు. సాధారణంగా శంకర్ తన సినిమాల స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఈసారి ఆయన పూర్తిగా ఇతరులపై ఆధారపడ్డారు. అయినప్పటికీ సక్సెస్ అయితే రాలేదు.
గతంలో, సుజాత రంగరాజన్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించేవారు. ఆయన మృతి అనంతరం శంకర్ తీసిన సినిమాలు విజయాలు అందుకోవడం కష్టమైపోయింది. సుజాత లేకపోవడంతో, స్క్రిప్టుల విషయంలో ఎమోషనల్ డెప్త్ కొరవడిందని చాలామంది అభిప్రాయం. ఇక మరోవైపు పూరి జగన్నాథ్ ఒకప్పుడు తన డైరెక్టింగ్ స్టైల్‌తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. కానీ, “టెంపర్” సినిమా తర్వాత, “ఇస్మార్ట్ శంకర్” మినహా అతని సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు.
ఇటీవల విడుదలైన “లైగర్” పూరి కెరీర్‌లో మరో పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రకటించిన “డబుల్ ఇస్మార్ట్” పై అంచనాలు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక పూరి ఇప్పటివరకు కొత్త సినిమా ప్రకటించకపోవడం, ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై సందేహాలు పెంచుతోంది. శంకర్, పూరి ఇద్దరికీ తమ కేరీర్‌లో కీలక మలుపు కోసం కొత్త స్ట్రాటజీ అవసరమైందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పూర్వపు విజయాలు అందించిన కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టం.
ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలి. మరి వారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.