అల్లు అర్జున్ (Allu Arjun) , రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్‌ను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, అనేక రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా ఇంతవరకు ఏ తెలుగు చిత్రానికీ సాధ్యంకాని స్థాయిలో విజయం సాధించింది.
అయితే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ పూర్తయ్యాయా అంటే, దానికి ఇంకా సమయం కావాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ ఏరియాలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తయిందని సమాచారం. కానీ నైజాం, ఆంధ్రా ఏరియాల్లో ఇంకా కొన్ని కోట్ల టార్గెట్ మిగిలి ఉంది. ముఖ్యంగా టికెట్ ధరలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలతో, నిర్మాతలు వాటిని తగ్గించడంతో కలెక్షన్లు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి వరకు సినిమా రన్ కొనసాగితే, ఈ టార్గెట్స్ కూడా అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
విదేశీ మార్కెట్లలో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో, పుష్ప 2 ఇప్పటివరకు $13 మిలియన్ వసూళ్లను సాధించింది. కానీ ఈ మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 మిలియన్ డాలర్లు. ఈ లెక్కన ఇంకా $2 మిలియన్లు వసూలు చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ 15.3 మిలియన్ డాలర్ల రికార్డును బ్రేక్ చేస్తే, పుష్ప 2 ఉత్తర అమెరికాలో కొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది. కానీ క్రిస్మస్ సీజన్‌తో మరిన్ని సినిమాలు థియేటర్లలోకి రావడం, కలెక్షన్లపై ప్రభావం చూపవచ్చు.
మరోవైపు, హిందీ మార్కెట్‌లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ నార్త్ బెల్ట్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ మార్కెట్లలో కూడా పుష్ప 2 హై రేంజ్ లాభాలు తెచ్చిపెట్టింది. అన్ని చోట్లా లాభాలు రావడం సంతోషంగా ఉన్నా, కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి కావడం కోసం నిర్మాతలు ఇంకా ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప 2 చివరి టార్గెట్స్ ఎప్పుడు పూర్తవుతాయో చూడాలి.