‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మొదటి వారంలో భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, ఇప్పుడు బయ్యర్లను పూర్తిగా సంతోషపెట్టే స్థాయిలో లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ తో పోలిస్తే, తెలుగు మార్కెట్ లో వసూళ్లు అంత సంతృప్తికరంగా లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి వారంలో సినిమా బాగా ఆడినా, రెండవ వారంలో టికెట్ అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
ఫస్ట్ వీక్ లో రూ.150 కోట్ల గ్రాస్ ను అందుకున్న తెలుగు వెర్షన్, రెండవ వారం ఆరంభంలోనే ఊహించిన స్థాయికి చేరలేకపోయింది. ముఖ్యంగా, హాలిడేస్ లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లపై విమర్శలు ఈ ప్రభావానికి కారణమయ్యాయి. ఈ సినిమాలో బయ్యర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల, ఇప్పుడు ఆ మోతాదు వసూళ్లు రాకపోతే నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి వారం 60 శాతం కలెక్షన్లను మాత్రమే అందుకున్న ఈ సినిమా, నైజాంలో మాత్రం స్థిరంగా ఉండగా, ఆంధ్ర ప్రాంతంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితి ‘పుష్ప 1’ (Pushpa) సమయంలో కూడా కనిపించింది. కానీ ఇప్పుడు మరింత గట్టి పోటీ ఉండటంతో సమస్య తీవ్రమవుతోంది. రాబోయే ఆదివారం వరకు సినిమా భారీ వసూళ్లు సాధిస్తేనే బయ్యర్లు లాభాల దిశగా వెళ్లగలరు. ముఖ్యంగా, మూడవ వారంలో స్టేడీ రన్ కొనసాగితేనే పరిస్థితి మెరుగ్గా మారే అవకాశం ఉంది. ఎనిమిదో రోజు తెలుగు వెర్షన్ రూ.9.4 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
హిందీ మార్కెట్ లో తళుక్కున మెరుస్తున్న ‘పుష్ప 2’కు తెలుగు మార్కెట్ లో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాకపోవడం పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. మూడు రోజులు కీలకం కానున్న ఈ తరుణంలో, తెలుగు ప్రేక్షకులు మళ్ళీ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ ఈ కష్టాలను దాటుకుని, తెలుగు బయ్యర్లకు గట్టిన లాభాలను అందిస్తుందా లేదా అన్నది చూడాలి.