విజయాలు, వివాదాలు అక్కా చెల్లెళ్లు అంటుంటారు… ఈ మాట నిజమని కొన్ని సంఘటనలను చూసినప్పుడు అర్ధమవుతుంది. అలాంటిదే ఇప్పుడు జరిగింది. రియో ఒలింపిక్స్ లో పతకం సాధించి అభినందనలు అందుకున్న భాగ్యనగర రాకెట్ పి.వి.సింధు ఓ వివాదంలో చిక్కుకుంది. ఒప్పందం ప్రకారం తమ దుస్తులను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ధరించలేదని ఆ కంపెనీ విరుచుకు పడుతోంది. సింధుతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ కొన్ని మ్యాచుల్లో తమ బట్టలు ధరించలేదని, ఇతర బ్రాండ్ల దుస్తులు ధరించారని ఆరోపించింది.
రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులందరూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలన్న షరతుతో భారత ఒలింపిక్స్ సంఘానికి రూ.3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారని భారత ఒలింపిక్స్ సంఘానికి ఆ కంపెనీ ఓ లేఖ రాసినట్లు తెలిసింది. సంఘం చెప్పినట్లుగా నడుచుకున్నా, తమ పేర్లు వివాదంలోకి చేరడంపై క్రీడాకారులు తల పట్టుకుంటున్నారు.