నాయకులు రాజకీయంలో పార్టీలు మార్చిన రీతిలో డైరక్టర్లు నిర్మాణ సంస్థలను మారుస్తుండడంతో నిర్మాతలకు చిర్రెత్తుకొస్తోంది. రాసిచ్చిన అగ్రిమెంట్స్ ని చిత్తుకాగితాల్లా భావిస్తుండడంతో న్యాయం కోసం పెద్దలను ఆశ్రయిస్తున్నారు. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫిర్యాదు చేశారు. ఊపిరి తర్వాత తన సంస్థ పీవీపీ సినిమాలో మరో సినిమా చేసేందుకు వంశీతో ఒప్పందం కుదుర్చుకొన్నాననీ, ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టి ఆయన వేరొక నిర్మాతతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇదివరకు ‘ఊపిరి’ చిత్రాన్ని పీవీపీ నిర్మించారు. ఆ చిత్రం తర్వాత ఇద్దరూ కలిసి మహేష్‌బాబుతో ఓ సినిమా చేద్దామనుకున్నారు. ప్రకటన కూడా వచ్చింది.
అయితే పీవీపీ బ్యానర్లో చేసిన బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో మహేష్ వారి బ్యానర్లో మరో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. దీంతో డైరక్టర్ నిర్మాతను మార్చారు. దిల్‌రాజు, ఆశ్వనీదత్ నిర్మాణంలో సినిమా చేయనున్నట్టు వంశీ పైడిపల్లి ప్రకటించారు. ఆ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. వంశీ పైడిపల్లి తదుపరి సినిమా తన సంస్థలో తీయకపోతే ‘ఊపిరి,’ చిత్రానికి వచ్చిన నష్టం మొత్తాన్ని చెల్లించాలని కోరారు. రెండు రోజుల కిందట ఈ ఫిర్యాదు అందిందని, త్వరలోనే దర్శకుల సంఘం పరిశీలన కోసం పంపుతున్నట్టు నిర్మాతల మండలి వర్గాలు తెలిపాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.