ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి వంటి హీరోలను స్టార్ హీరోలుగా నిలబెట్టి… వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి సక్సెస్ ఫుల్ హీరోలను టాలీవుడ్ కు అందించిన గొప్ప దర్శకుడు.. మన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. అంతే కాదు ఎంతో మంది టాప్ హీరోయిన్లను కూడా పరిచయం చేసారు. ఇదిలా ఉండగా… ఇటీవల టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కు రాజీనామా చేసి… ఇప్పుడు ఓ కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు రాఘవేంద్ర రావు.
నేడు ఎన్టీఆర్ జయంతి కావడంతో తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తన సోషల్ మీడియా ద్వారా కె.రాఘవేంద్ర రావు ఈ విషయాన్ని ప్రకటించారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ… “నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో…” అంటూ పేర్కొన్నారు. ముగ్గురు డైరెక్టర్స్, ముగ్గురు హీరోయిన్స్ తో ఈ చిత్రం రూపొందనున్నట్టు స్పష్టం చేసారు.