ఒక తెలుగు సినిమా ట్రైలర్ చూసి “ఎంత సహజంగా” అని తెలుగు ప్రేక్షకులు అనుకోని చాలా ఏళ్లవుతోంది. “కేరాఫ్ కంచరపాలం” తర్వాత ఆస్థాయిలో సహజమైన భావాలతో ఆకట్టుకొన్న ట్రైలర్ “రాజా వారు రాణి గారు”. ఒక సింపుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకొంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? తెలుగు ప్రేక్షకులను సహజత్వంతో అలరించగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ: రాణి (రహస్య గోరక్)ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాడు రాజు (కిరణ్ అబ్బవరం). ఇంటర్ మొదటి సంవత్సరంలో మొదలైన ఈ ప్రేమ చూపులకు మాత్రమే పరిమితమవుతుంది. నోటి నుండి ప్రేమించాను అని చెబుదామనేలోపు రాణి డిగ్రీ చదువుకోవడం కోసం బయట ఊరికి వెళ్లిపోతుంది. రాణి ఎప్పుడు వస్తుందా? అని రాజు వెయిట్ చేయడం, సమాధానం తెలియని ప్రశ్న కోసం వెతుకుతున్న రాజును చూసి ఊర్లోవాళ్ళందరూ ఎగతాళి చేయడం జరుగుతూనే ఉంటాయి. అయినా నమ్మకం కోల్పోకుండా రాణి రాక కోసం ఎదురుచూస్తుంటాడు రాజు.
ఆ ఎదురుచూపుకు ఫలితం లభించిందా? రాణికి రాజు తన ప్రేమను చెప్పగలిగాడా? వీళ్ళ ప్రేమకి అడ్డంకి ఏమిటి? వంటివి తెలియాలంటే “రాజా వారు రాణి గారు” చిత్రం చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే.. సినిమాలోని పాత్రలు నచ్చాలి, వారి వ్యవహార శైలి ఆకట్టుకోవాలి. “రాజా వారు రాణి గారు” సినిమాలో అదే జరిగింది. హీరో హీరోయిన్లు మొదలుకొని ఊర్లో జనాలు వరకూ ఎవరూ నటించలేదు.. పాత్రలు పోషించారు. ఏ ఒక్క పాత్ర కూడా అసహజంగా అనిపించకపోవడం సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కిరణ్, రహస్య, యుజుర్వేద్, రాజ్ కుమార్ ఇలా ప్రతి ఒక్కరూ సహజమైన హావభావాలతో ఆకట్టుకొన్నారు. ప్రతి పాత్రకి ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెట్ అవుతారు. ముఖ్యంగా హీరో & హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మనకి మనం చేసిన అల్లరి-చిలిపి పనులను గుర్తుచేస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: విద్యాసాగర్-అమర్ దీప్ ల సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సాధారణంగా మలయాళ సినిమాలు చూసి “అబ్బా! వాళ్ళ నేటివిటీని ఎంత అద్భుతంగా తెరపై ప్రెజంట్ చేశారు?” అని కుళ్లుకుంటాం (కుళ్ళు అంటే ఏడుపు కాదండోయ్.. మన తెలుగు సినిమాల్లో ఆ సహజత్వం కనిపించదనే బాధ). అందమైన గోదావరి అందాలని అత్యద్భుతంగా తెరపై చూపించారు ఈ సినిమాటోగ్రాఫర్స్ ద్వయం. లోలైటింగ్ అనేది సన్నివేశాలను, ఎమోషన్స్ ను ఎంత బాగా ఎలివేట్ చేస్తుంది అని చెప్పడానికి వీళ్ళ సినిమాటోగ్రఫీ వర్క్ ఒక మంచి ఉదాహరణ. జైక్రిష్ పాటలు బాగున్నాయి.. పాటల కంటే నేపధ్య సంగీతం ఇంకా బాగుంది. కాకపోతే.. ఒక్కోసారి సన్నివేశంలోని ఎమోషన్ కంటే మ్యూజిక్ లో యాంగ్జైటీ ఎక్కువవ్వడం వలన ఇక్కడ అంత టెంపో అవసరం లేదేమో అనిపిస్తుంది తప్పితే.. సంగీత దర్శకుడిగా జైక్రిష్ పనితనాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.
ఇక దర్శకుడి గురించి చెప్పుకోవాలి. దర్శకుడు రవికిరణ్ ను చూస్తే భారతంలో అభిమన్యుడు గుర్తొచ్చాడు. కదనరంగంలోకి దూకిన అభిమాన్యుడికి పద్మవ్యూహం లోకి వెళ్ళడం వచ్చు కానీ.. అందులో నుండి బయటకు రావడం తెలియదు. అలాగే కిరణ్ “రాజా వారు రాణీ గారు” సినిమా మొదటిభాగంలో ఆద్యంతం హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించి.. సెకండాఫ్ ను ఎలా డీల్ చేయాలి, ఒక ముగింపు అనేది ఎలా ఇవ్వాలి అనే స్పష్టత లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. అక్కడే బెడిసికొట్టింది. ఈ సినిమా మూల కథ పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” చిత్రాన్ని తలపిస్తుందా లేక మరో చిత్రాన్ని గుర్తు చేస్తుందా అనే విషయం పక్కన పెడితే.. కథనం మాత్రం కాస్త పక్కదారి పట్టింది. ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో సంతృప్తిపరచగల ముగింపు కొరవడింది. దాంతో.. “రాజా వారు రాణి గారు” ఒక మంచి సినిమాగా మిగిలిపోయింది.
విశ్లేషణ: మన బాల్యాన్ని-గతాన్ని గుర్తు చేసే సందర్భాలు.. ఆరోగ్యకరమైన హాస్యం, సహజమైన సంభాషణలు-పాత్రలు, స్వచ్చమైన ప్రేమ వంటివి ఆస్వాదించాలంటే “రాజా వారు రాణి గారు” సినిమా చూడాలి. అయితే.. సెకండాఫ్ లో కాస్త సహనం ఉండాలండోయ్!
రేటింగ్: 2.75/5