దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎన్నో అపురూప చిత్రాలను తెరకెక్కించారు. బాహుబలి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని అమాంతం పెంచారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తెలుగు సినిమా తగ్గదని నిరూపించారు. ఇలాంటి సమయంలో అతని నుంచి భారతీయులకే సొంతమైన మహా భారత గాధ వెండితెరపై వస్తుందని అందరూ ఆశించారు. విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాని రాజమౌళి తీస్తారని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. రాజమౌళి కూడా మహాభారతం నా కల అని మీడియా అనేక సార్లు చెప్పారు. కానీ తాజాగా మహా భారత విషయంలో వెనకడుగు వేసినట్లు తెలిసింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ”మహాభారతం సినిమా నా కల అని చెప్పానే కానీ ఆ కథ ఆధారంగా సినిమాను తీస్తున్నానని మాత్రం చెప్పలేదు” అని జక్కన్న సంచలనం కామెంట్స్ చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా శ్రీకుమార్ మీనన్ మహాభారతం తెరకెక్కిస్తున్నారు. ఇందులో భీముడిగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఖరారు అయ్యారు. ఈ సినిమా కారణంగానే రాజమౌళి మహా భారతం సినిమా ఆలోచనని విరమించుకున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.