టాలీవుడ్ పరిశ్రమ గురించి మాట్లాడుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు.. ‘బాహుబలి’ కి తర్వాత అనేలా మార్చేశాడు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ అనే మరో భారీ చిత్రం కూడా రాబోతుందన్న సంగతి తెలిసిందే.జనవరి 7న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.ప్రపంచమంతా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉండగా.. ఆయనలో మంచి దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడని
ఆ మధ్య ‘ఈగ’ ఆడియో వేడుకలో నాని చెప్పుకొచ్చాడు. నటించడం అనేది బాగా సరదా అని కూడా ‘మగధీర’ టైములో రాజమౌళి చెప్పుకొచ్చాడు.మేకింగ్ వీడియోల ద్వారా ఆ ముచ్చట తీర్చుకుంటూ ఉంటానని కూడా తెలిపాడు. తాను డైరెక్ట్ చేసిన ‘సై’, ‘బాహుబలి ది బిగినింగ్’ వంటి సినిమాల్లో రాజమౌళి చిన్న కేమియో రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వేరే దర్శకులు తెరకెక్కించిన సినిమాల్లో కూడా రాజమౌళి నటించాడు. అందులో నాని నటించిన ‘మజ్ను’, వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెయిన్ బో’ వంటి సినిమాలు ఉన్నాయి.
వీటిలో ‘మజ్ను’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకోగా.. ‘రెయిన్ బో’ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. దర్శకుడిగా రాజమౌళికి ప్లాప్ లేకపోవచ్చు. కానీ నటుడిగా రాజమౌళి నటించిన సినిమాల్లో ప్లాప్ ఏదైనా ఉందా అంటే అది ఒక్క ‘రెయిన్ బో’ మాత్రమే అని చెప్పాలి.