Rajamouli: మరో మంచి పనికి కారణమైన రాజమౌళి.. ఏమైందంటే?

సెలబ్రిటీలు చెబితే కొన్ని పనులు ఆటోమేటిగ్గా జరిగిపోతాయి అంటారు. అందుకేనేమో కొంతమంది సెలబ్రిటీలు సమాజం కోసం కొన్ని అంశాలను అప్పుడప్పుడు లేవనెత్తుతుంటారు. అలా ప్రముఖ దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli)  కూడా ఇటీవల ఓ విషయం గురించి తన సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. అదే ‘దేవ్‌ మాలి’ పర్వతం మీద ఉన్న చెత్త గురించి. ఆ పర్వతం మీదకు వస్తున్న వాళ్లు చెత్త పడేసి ఓ చెత్త కుప్పలా చేసేస్తున్నారు అని ఆయన తన సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

Rajamouli

మహేశ్‌ బాబు(Mahesh Babu) , ప్రియాంక చోప్రా(Priyanka Chopra) , పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఒడిశాలో జరిగింది. ఆ సమయంలో రాజమౌళి ఒడిశాలోనే అత్యంత ఎత్తైన దేవ్‌మాలిని ఒంటరిగా ట్రెక్కింగ్‌ చేస్తూ ఎక్కారు. ప్రకృతి అందాలను తన కెమెరా బంధించి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే అయితే అక్కడి పరిస్థితులు బాధించాయని, అంతా అపరిశుభ్రంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. సందర్శకులు వ్యర్థాలను తిరిగి తమవెంట తీసుకెళ్లాలని సూచించారు.

రాజమౌళి చెప్పిన తర్వాత కొరాపుట్‌ జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి దేవ్‌మాలి పర్వత ప్రాంతంపై ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్స్‌, చెత్తను సేకరించారు. మొత్తం క్లీన్‌ చేసి స్వచ్ఛ దేవ్‌మాలిని తిరిగి సందర్శకులకు అందించారు. ఈ విషయాన్ని ఒడిశాలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్‌ సుపర్ణో సత్పతి తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ పోస్టులపై రాజమౌళి కూడా స్పందించారు. పర్వతంపై ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను సేకరించిన స్వచ్ఛంద సభ్యుల చొరవను జక్కన్న ప్రశంసించారు. మన సహజ సంపదను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవడానికి కృషి చేస్తూనే ఉందాం అని పిలుపునిచ్చారు. దీని కోసం అందరూ బాధ్యతాయుతమైన పర్యాటకం వైపు అడుగులు వేయాలని కోరారు.

‘జాట్‌’ వదిలేయడం మంచి నిర్ణయమేనా? రవితేజ చేసుంటే ఎలా ఉండేదో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus