Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సన్నీ డియోల్ (Hero)
  • రెజీనా కాసాండ్రా (Heroine)
  • రణదీప్ హూడా,వినీత్ కుమార్ సింగ్,జగపతి బాబు,రమ్యకృష్ణ,సయామి ఖేర్,పృథ్వీ రాజ్,ఉపేంద్ర లిమాయే (Cast)
  • గోపీచంద్ మలినేని (Director)
  • నవీన్ యెర్నేని ,రవిశంకర్ యలమంచిలి ,టి.జి.విశ్వ ప్రసాద్ ,వివేక్ కూచిబొట్ల (Producer)
  • థమన్ ఎస్ (Music)
  • రిషి పంజాబీ (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 10, 2025

తెలుగు కమర్షియల్ ఫార్మాట్ ను బాలీవుడ్ కి పరిచయం చేసే పనిలో తాజాగా అక్కడికి పయనమైన దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ టైటిల్ పాత్రలో అతను తెరకెక్కించిన చిత్రం “జాట్” (Jaat). మైత్రీ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం క్యాస్టింగ్ & ట్రైలర్ ఆల్రెడీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

Jaat Review

కథ: అయోధ్య స్పెషల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ.. మధ్యలో చోటు చేసుకున్న ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా చీరాలలో టిఫిన్ కోసం ఆగుతాడు బల్బీర్ ప్రతాప్ సింగ్ (సన్నీ డియోల్). తన మానానికి తాను వేడి వేడి ఇడ్లీ తింటుండగా.. ఓ రౌడీ గ్యాంగ్ వచ్చి ఆ ఇడ్లీలను కింద పడేస్తారు. దాంతో “సారీ బోల్” అంటూ చాలా మర్యాదగా అడుగుతాడు బల్బీర్.

ఓ ఆకు రౌడీ సారీ చెప్పకపోవడంతో, అతని వెనకున్న రామసుబ్బారెడ్డి (అజయ్ ఘోష్), సుబ్బారెడ్డి వెన్నుదన్నుగా నిలబడే సోములు (వినీత్ కుమార్ సింగ్), సోములు అహంకారానికి మూలకారకుడైన రణతుంగ (రణదీప్ హుడా).. ఇలా అందర్నీ ఒక్కొక్కరిగా ఢీకొంటూ వెళ్లిపోతుంటాడు బల్బీర్.

అయితే.. రణతుంగ ఇంటికి వెళ్లిన బల్బీర్ కి కొన్ని నమ్మలేని విషయాలు తెలుస్తాయి. అసలు రణతుంగ ఎవరు? అతను ప్రకాశం జిల్లాలో ఏం చేస్తున్నాడు? అక్కడి ప్రజల ప్రాణాలతో ఎందుకని ఆడుకుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “జాట్” చిత్రం.

నటీనటుల పనితీరు: సన్నీ డియోల్ ను “గదర్, బార్డర్, గయాల్” లాంటి సినిమాల్లో చూసిన తర్వాత, అతడ్ని జాట్ లో చూడడం కాస్త కొత్తగానే కనిపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో అతడి క్యారెక్టరైజేషన్ భలే ఫన్ క్రియేట్ చేసింది. మాస్ ఎలివేషన్స్ తోపాటుగా క్యారెక్టరైజేషన్ తో కథను నడిపించిన విధానం బాగుంది. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి క్యారెక్టర్ ఎలివేషన్ ను మరీ పీక్ కి తీసుకెళ్లాలనే అత్యాశతో పొంతన లేని అంశాలను ఇరికించేసి కిచిడీ చేసేశాడు దర్శకుడు. అందువల్ల ఫస్టాఫ్ ను ఆస్వాదించినంతగా, సెకండాఫ్ లో సన్నీ డియోల్ పాత్రను ఎంజాయ్ చేయలేరు ప్రేక్షకులు.

విలన్ గా రణదీప్ హుడా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే.. సెకండాఫ్ చివర్లో ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ ఎలివేషన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి.

రెజీనాకి మంచి పవర్ ఫుల్ రోల్ దొరికింది. ఆ పాత్రలో చక్కగా ఒరిగిపోయింది కూడా. సయామీ ఖేర్ క్యారెక్టర్ ఓపెనింగ్ సీక్వెన్స్ కి ఉపయోగపడింది కానీ.. ఆమె పాత్ర పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

ఇక.. లెక్కలేననంతమంది తెలుగు ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించడం అనేది బాలీవుడ్ జనాలకి ఎంత కొత్తగా అనిపించిందో తెలియదు కానీ.. తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఏదో తెలుగు సినిమాను హిందీ డబ్బింగ్ వెర్షన్ లో చూస్తున్న భావన కలుగుతుంది.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ వర్క్, సీజీ వర్క్, ఫైట్ సీన్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ బాగా కుదిరాయి. సన్నీ డియోల్ నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. తమన్ పాటల సోసోగా ఉండగా.. నేపథ్య సంగీతం మాత్రం మంచి కిక్ ఇచ్చింది.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ సీన్స్ ను రాయడంలో, ఎగ్జిక్యూట్ చేయడంలో దిట్ట అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడం కోసం బలాత్కారాలను సినిమాలో ఇరికించడం అనేది ఇకనైనా తగ్గిస్తే మంచిది. ఎంత రొటీన్ యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఈ తరహా బలాత్కారాలు ఇకపైన అవసరం లేదు అనే విషయాన్ని గోపీచంద్ గ్రహించాలి.

ఫస్టాఫ్ వరకు చాలా ఫన్ & ఎంటర్టైనింగ్ గా సాగిన సినిమాను సెకండాఫ్ కి వచ్చేసరికి అతుకుల బొంతలా అల్లడం అనేది మైనస్ గా మారింది. అందువల్ల.. “జాట్”తో దర్శకుడిగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు గోపీచంద్ మలినేని.

విశ్లేషణ: లాజిక్స్ తో పనిలేని టెంప్లేట్ యాక్షన్ సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే కోకొల్లలుగా వచ్చాయి. అదే ఫార్మాట్ ను బాలీవుడ్ కి తీసుకెళ్లాడు గోపీచంద్ మలినేని. ఫస్టాఫ్ లో సన్నీ డియోల్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ బ్లాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. సెకండాఫ్ లో అసంబద్ధంగా వచ్చే క్యారెక్టర్ ఎలివేషన్స్, అనవసరంగా ఇరికించిన సెంటిమెంటల్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఆ కారణంగా “జాట్” చిత్రం అర్ధ భాగం అలరించి, మలి భాగం ఎప్పుడైపోతుందా అనిపించింది.

ఫోకస్ పాయింట్: సెన్స్ లెస్ మాస్ కి ఎమోషన్ సెట్ అవ్వకపోతే వర్కవుట్ అవ్వదయ్యా మలినేని!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus