రాజమౌళి పుత్రోత్సాహంలో ఉన్నారు. ఇలా ఎందుకంటున్నానో ఈపాటికే మీకు అర్ధమైపోయుంటుంది. మేటర్ ఏంటంటే.. రాజమౌళి (Rajamouli) తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టి (Premalu) ‘ప్రేమలు’ అనే డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేశారు. అదే ‘ప్రేమలు’. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన మలయాళం సినిమా ఇది. అక్కడ సూపర్ హిట్ అవ్వడం, పైగా ఒరిజినల్ వెర్షన్ కూడా ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడంతో.. దీనిని తెలుగులోకి కూడా డబ్ చేసి శివరాత్రి కానుకగా మార్చి 8 న రిలీజ్ చేశారు.
తెలుగు వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ’90s'(వెబ్ సిరీస్) డైరెక్టర్ ఆదిత్య రాసిన తెలుగు డైలాగులు కూడా అందరికీ హిలేరియస్ గా అనిపించాయి. అందుకే తెలుగులో కూడా ఈ మూవీ సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దీనికి రాజమౌళి గెస్ట్ గా వచ్చాడు. ‘కొడుకు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా సక్సెస్ సాధించడం వల్ల ఆయన చాలా ఆనందంలో ఉండి.. కొంచెం అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు’ అనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఏమైంది అంటే రాజమౌళి మాట్లాడుతూ.. ‘మలయాళం సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు అందరూ చాలా టాలెంటెడ్. మలయాళం మేకర్స్ ఈర్ష్య పడే స్థాయిలో అక్కడి యాక్టర్స్ ని తయారు చేస్తున్నారు. ‘ప్రేమలు’ ద్వారా ఇంకొంతమంది టాలెంటెడ్ మలయాళం నటీనటులు తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే ‘రాజమౌళి దృష్టిలో మలయాళం నటీనటులే టాలెంటెడా?’ అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ‘తెలుగు సినిమా పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు.. ఇలా ఇక్కడి నటీనటులను పక్కన పెట్టి, పరభాషా నటీనటులను పొగడడం ఏంటి?’ అంటూ చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో ఓ తెలుగు నటుడు కూడా నటించాడు. అతని పేరు కళ్యాణ్ పాలగుమ్మి. ‘ప్రేమలు’ లో ఇతను టీం లీడ్ శ్రీనివాస్ అలియాస్ శ్రీని అనే పాత్రలో కనిపించాడు. గతంలో ఇతను ‘సేవ్ ది టైగర్స్'( వెబ్ సిరీస్) ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. ‘ప్రేమలు’ లో విలన్ టైపు రోల్ చేసిన శ్యామ్(ఆది పాత్ర) పక్కనే ఉండే పాత్ర ఇతనిది. ఇతను ఉన్నాడు అని గ్రహించకుండా ‘మొత్తం మలయాళం’ నటీనటులు అనేసుకున్నాడు రాజమౌళి.