‘ఆస్కార్’ వేదిక మీద ఎం.ఎం.కీరవాణి స్పీచ్ విన్నారా? ఆయన గురించి, ఆయన సంగీతం గురించి చెబుతున్నప్పుడు ఆయన ఓ వ్యక్తి పేరు వాడారు. ఆయనే అమెరికా దిగ్గజ సంగీతకారుడు రిచర్డ్ కార్పెంటర్. తన సంగీతం వెనుక ఉన్న వ్యక్తి అతనే అంటూ.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన గురించే కీరవాణి కన్నీళ్లు పెట్టుకున్నారట. అదేంటి అనుకుంటున్నారా? తను ఎంతో అభిమానించే వ్యక్తి తన గురించి పాట పాటి విషెష్ చెబితే ఆనందం ఉంటుంది కదా.
కీరవాణి కన్నీరు విషయాన్ని రాజమౌళి చెప్పారు. ఈ మేరకు ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కార్పెంట్ ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి తన సోదరుడు కీరవాణి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని రాజమౌళి తెలిపారు. ఆస్కార్ ప్రచారం మొత్తం ఎంతో ప్రశాంతంగా ఉన్న కీరవాణి రిచర్డ్ కార్పెంటర్ సందేశం చూసిన తర్వాత ఉద్వేగానికి లోనైనట్లు రాజమౌళి చెప్పారు. ‘‘ఆస్కార్ ప్రచారంలో మా అన్నయ్య ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ఆస్కార్ గెలుపొందడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఏ విధమైన ఉద్వేగాన్ని కూడా బయటపెట్టలేదు.
కానీ, మీ పోస్ట్ చూశాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని రాజమౌళి చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకుగాను ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గెలుపొందిన అనంతరం కీరవాణి మాట్లాడుతూ రిచర్డ్ కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగాను అని చెప్పారు. ఆ తర్వాత రిచర్డ్ కార్పెంటర్ ఫేమస్ సాంగ్ ‘టాప్ ఆఫ్ ది వరల్డ్…’ పాటను తనదైన శైలిలో కీరవాణి పాడి వినిపించారు. దీనిపై రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తన కుమార్తెలతో కలసి రిచర్డ్ కార్పెంటర్ ‘టాప్ ఆఫ్ ది వరల్డ్…’ పాటను ఆలపిస్తూ టీమ్‌కి కంగ్రాట్స్ చెప్పారు. ఆ పోస్ట్ చూశాకనే కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. తను అభిమానించే వ్యక్తి తనకు నచ్చిన పాటతో అలా విషెష్ చెబితే కంట్రోల్ చేసుకోవడం కష్టమే కదా.