Rajinikanth: అమితాబ్‌ గురించి అద్భుతంగా మాట్లాడిన రజనీ.. ఆయనకు మాత్రమే సాధ్యమంటూ..!

పడినవాడు బాధపడకూడదు.. పడి లేవని వాడు, లేవలేని వాడు బాధపడాలి అని అంటుంటారు పెద్దలు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం మీకు కావాలి అంటే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను (Amitabh Bachchan) చూస్తే సరి. ఎందుకంటే స్టార్‌ హీరోగా దేశంలోనే అత్యంత ఉన్నత స్థానంలో ఉండి అలరించి ఆయన.. ఒక దశలో చాలా ఇబ్బంది పడ్డారు. అప్పులు అయిపోయి.. ఓ సమయంలో ఇల్లు అమ్మేశారు కూడా. కానీ ఆ తర్వాత అనూహ్యంగా దూసుకొచ్చారు. తాజాగా, ఈ విషయాల గురించి రజనీకాంత్‌  (Rajinikanth)   మాట్లాడారు. ఆయన, అమితాబ్‌ బచ్చన్‌ కలసి ‘వేట్టయాన్‌’ (Vettaiyan)  అనే సినిమా చేస్తున్నారు.

Rajinikanth

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా అమితాబ్‌ బచ్చన్‌ గురించి రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో అమితాబ్‌ చాలా ఇబ్బందులు పడ్డారని, ఆర్థిక సమస్యలు చాలా చవి చూశారని రజనీకాంత్ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అమితాబ్‌ బచ్చన్‌కు గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నా.. ఆయన సాయం తీసుకోలేదని, తనంతట తానే అన్నింటినీ ఎదుర్కొని మళ్లీ ధైర్యంగా నిలబడ్డారని తలైవా పేర్కొన్నారు. అమితాబ్‌ నిర్మాతగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. భారీ నష్టాలు ఎదుర్కొన్నారు.

వాచ్‌మెన్‌కూ జీతం చెల్లించలేని స్థితికి వచ్చారు. ఆ సమయంలో జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. ఆ సమయంలో బాలీవుడ్‌ మొత్తం అమితాబ్‌ను చూసి నవ్వింది అని చెప్పారు. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా బిగ్‌బీ కుంగిపోలేదని, మళ్లీ తిరిగి నిలబడటం కోసం శ్రమించారని చెప్పారు. ఆ సమయంలో మూడేళ్ల పాటు యాడ్స్‌, కౌన్‌ బనేగా కరోడ్‌పతి లాంటివి చేసి తిరిగి నిలదొక్కుకున్నారని అమితాబ్‌ గురించి రజనీ చెప్పారు. అలా తాను పొగొట్టుకున్న వాటిని తిరిగి పొందారని చెప్పారు. జూహూలోని ఇంటితోపాటు అదే వీధిలో మరో మూడు ఇల్లు కొనుగోలు చేశారని చెప్పారు.

82 ఏళ్ల వయసులో రోజూ 10 గంటలు పనిచేస్తూనే ఉంటున్నారు అమితాబ్‌ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు రజనీ (Rajinikanth). అమితాబ్‌కు గతంలో ఒక ప్రమాదం జరిగిందని, అప్పుడు ఇందిరా గాంధీ ఒక సమావేశం కోసం విదేశాలకు వెళ్లారని.. అయితే ఈ విషయం తెలిసి ఆమె ఇండియా తిరిగి వచ్చేశారని ఆ రోజుల గురించి రజనీ తెలిపారు. అప్పుడే రాజీవ్‌ గాంధీ, అమితాబ్ కలిసి చదువుకున్నారని అందరికీ తెలిసింది అని రజనీ చెప్పారు.

 వచ్చే ఏడాది మూడు సినిమాలు అని చెప్పిన అడివి శేష్‌.. మూడోది ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus