రాజుగారి గది 2

  • October 13, 2017 / 07:08 AM IST

నాగార్జున-సమంతల మామాకొడళ్లుగా మారకముందే కలిసి నటించినా.. అఫీషియల్ గా మామాకొడళ్లు అయ్యిన తర్వాత విడుదలైన చిత్రం “రాజుగారి గది 2”. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం “రాజుగారి గది”కి సీక్వెల్ కానప్పటికీ సేమ్ జోనర్ కావడంతో పార్ట్ 2గా ప్రమోట్ చేస్తున్నారు. మలయాళ చిత్రం “ప్రేతమ్”కు రీమేక్ గా రూపొందిన “రాజుగారి గది 2” ప్రేక్షకుల్ని ఏమేరకు భయపెట్టిందో, ఎంత నవ్వించిందో చూద్దాం..!!

కథ : అశ్విన్-కిషోర్-ప్రవీణ్ (అశ్విన్ బాబు, వెన్నెలకిషోర్, ప్రవీణ్)లు ముగ్గురు స్నేహితులు. జీవితంలో సెటిల్ అవుదామన్న ఆలోచనతో గోవాలో ఒక రిసార్ట్ కొంటారు. కొత్తలో అంతా బాగానే ఉన్నప్పటికీ.. రానురాను పరిస్థితుల్లో భయానకమైన మార్పులు చోటు చేసుకొంటాయి. అశ్విన్ అండ్ బ్యాచ్ ఉండే రూమ్ లో దెయ్యం ఉందని భయపడుతుంటారు. వారి భయాన్ని పోగొట్టడంతోపాటు ఆ దెయ్యం సమస్యను తీర్చడానికి వస్తాడు రుద్ర (నాగార్జున) అనే మెంటలిస్ట్. మనిషి ముఖం చూసి మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పగలగడమే మెంటలిజం. దెయ్యం మిస్టరీ సాల్వ్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన రుద్రకు.. ఆ ఆత్మ అమృత (సమంత)ది అని తెలుసుకొంటాడు. అసలు అమృత ఎవరు? చనిపోవడానికి గల కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు రుద్ర సమాధానాలు ఎలా సంపాదించాడు అనేది “రాజుగారి గది 2” కథాంశం.

నటీనటుల పనితీరు : రుద్ర అనే మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా.. ఒక నిజమైన మెంటలిస్ట్ తాలూకు స్వభావం మాత్రం కనిపించదు. నిజానికి మెంటలిస్ట్ అంటే మనిషి కళ్ళల్లోకి చూసి అతడు నిజం చెబుతున్నాడో, అబద్ధం చెబుతున్నాడో తెలుసుకోగలగడం. కానీ.. ఇక్కడ నాగార్జున రోజుల క్రితం జరిగింది మాత్రమే కాక కొన్ని సంవత్సరాల ముందు జరిగిన విషయాలను కూడా కళ్ళకు కట్టినట్లు చెబుతుంటాడు. ఆ ఒక్క క్యారెక్టరైజేషన్ మిస్టేక్ తప్పితే నాగార్జున నవమన్మధుడిలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.

అక్కినేని సమంత ఈ చిత్రంలో మొదటిసారిగా ఆత్మ పాత్ర పోషించింది. అయితే.. ఆమె మేకప్ విషయంలో సరిగా జాగ్రత్త తీసుకోకపోవడం వలన కళ్ళల్లో కనపడాల్సిన రెడ్ కలర్ (నిజానికి అది క్రౌర్యం) కళ్ల కిందకి వచ్చేసింది. కనిపించేది కాసేపే అయినా ఆకట్టుకొని అలరించింది సమంత. అశ్విన్ బాబు, వెన్నల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ ల పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. సీరత్ కపూర్ కాస్త స్లీజీగా కనిపించడం, అందుకోసం యద లోతులు కనిపించేలా, తొడ సౌందర్యాలు దర్శనమిచ్చేలా చిట్టిపొట్టి దుస్తులు ధరించిందే తప్ప పెర్ఫార్మెన్స్ తో మాత్రం అలరించలేకపోయింది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం సీరత్ క్యారెక్టర్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. కీలకమైన పాత్రలో అభినయ ప్రశంసనీయమైన అభినయంతో ఆకట్టుకొంది.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ సంగీతం ఆయన చెప్పినట్లుగా నిజంగానే కొత్తగా ఉంది. ఇంతకుముందుగా డైలాగులు వినపడకుండా డప్పు సౌండ్లతో ధియేటర్ దద్దరిల్లేలా చేయకుండా.. డైలాగ్ వెర్షన్ దగ్గర ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ లేకుండా.. హారర్ లేదా ఇంటెన్స్ సీన్స్ లో ఎలివేషన్ కోసం మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ ను వాడడం ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది. ఆర్.దివాకరన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. అబ్బో అనిపించే సరికొత్త ఫ్రేమింగ్స్ కనిపించలేదు కానీ.. క్వాలిటీ పరంగా ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఓంకార్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముంబైలో చేయించిన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. అలాగే.. సమంత క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడం కోసం చేసిన సీజీ వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. అబ్బూరి రవి సంభాషణలు సహజంగా ఉన్నాయి. కామెడీ పంచ్ లు పెద్దగా పేలకపోయినా.. క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు కొన్ని సన్నివేశాల్లో ఆడతనం గురించి ఆడవాళ్ళ గురించి రాసిన కొన్ని సంభాషణలు ఆకట్టుకొంటాయి.

ఇక మన యాంకర్ టర్నడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ అన్నియ్య గురించి చెప్పాలంటే.. మలయాళ హిట్ సినిమా “ప్రేతమ్” నుండి కేవలం సౌల్ ను మాత్రమే తీసుకొన్నాని, ట్రీట్ మెంట్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని నొక్కి వక్కాణించిన ఓంకార్ ఓపెనింగ్ సీక్వెన్స్ తప్ప ఫస్టాఫ్ మొత్తం సేమ్ టు సేమ్ దింపేయడం గమనార్హం. అలాగే.. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఓంకార్ తీసుకొన్న స్పెషల్ కేర్ లో కొంత కథనంపై కూడా పెట్టి ఉంటే బాగుండేది. పైగా.. “రాజుగారి గది” తరహాలో కామెడీతో కాసేపు నవ్విద్దామని రాసుకొన్న ఎపిసోడ్స్ పెద్దగా పేలలేదు. అందువల్ల ఫస్టాఫ్ చాలా పేలవంగా సాగుతుంది. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి కాస్త జాగ్రత్తపడ్డాడు. సమంత స్టోరీ మొదలైనప్పట్నుంచి.. క్లైమాక్స్ జడ్జ్ మెంట్ ఎపిసోడ్ వరకూ సినిమా ఓ మోస్తరుగా అలరిస్తుంది. నటీనటుల నుంచి సన్నివేశానికి తగ్గ నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయిన ఓంకార్.. సినిమాను సరసమైన స్క్రీన్ ప్లేతో తీర్చిదిద్దడంలో మాత్రం బాగా తడబడ్డాడు.

విశ్లేషణ : సో, ఓవరాల్ గా చెప్పాలంటే “రాజుగారి గది” రేంజ్ లో కాకపోయినా ఓ మోస్తరుగా ఆకట్టుకొనే చిత్రం “రాజుగారి గది 2”. అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతల పెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ అండ్ తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అలాగే.. ఫస్టాఫ్ అండ్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. సో, మరీ విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ లాంటివి పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే పర్లేదు కానీ.. మరీ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కాస్త కష్టమే.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus