స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. స్పైడర్ సినిమా ఫ్లాప్ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో రకుల్ కు ఆఫర్లు తగ్గాయి. గతేడాది రకుల్ కొండపొలం సినిమాలో నటించగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. సినిమా రంగంలో సక్సెస్ కావాలంటే ఎంత అద్భుతంగా నటించినా లక్ కూడా కచ్చితంగా ఉండాలి.
గతేడాది నుంచి వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులలో బిజీ అయిన రకుల్ నటించిన సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. థ్యాంక్ గాడ్, ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జీ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ సినిమాలు విడుదలై ఉంటే రకుల్ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగేది. కానీ ఎవరూ ఊహించని విధంగా రకుల్ కెరీర్ పై ఒమిక్రాన్ దెబ్బకొట్టింది. 2019 సంవత్సరంలో బాలీవుడ్ లో రిలీజైన దేదే ప్యార్ దే మూవీ రకుల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ లో నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కావాలని రకుల్ అనుకుంటున్నారు. అయితే పెరుగుతున్న కేసులు రకుల్ కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ లా మారాయి. ప్రస్తుతం నార్త్ లో నెలకొన్న పరిస్థితుల గురించి స్పందించిన రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రభావం ఇండస్ట్రీపై గట్టిగా పడే ఛాన్స్ ఉందని రకుల్ అన్నారు. చాలా కుటుంబాలు సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
సినిమాలపై ఇన్వెస్ట్ చేసి చాలామంది ఎదురుచూస్తున్నారని రకుల్ కామెంట్లు చేశారు. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటూ ప్రార్థించడం మినహా మరేం చేయలేమని రకుల్ పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని రకుల్ కామెంట్లు చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదైనా రకుల్ కు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.