బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను రాజకీయంగా విమర్శించాలి అని అనుకునేటప్పుడల్లా అప్పటి ప్రతిపక్షాలు, ఇప్పటి అధికారపక్షం ఓ హీరోయిన్ పేరును ఎక్కువగా ప్రస్తావించేవి. ఏమనేవారు, ఎందుకనేవారు అనేది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. కానీ ఇటీవల మరోసారి ఆ విషయాన్ని బయటకు తీసి కేటీఆర్‌ను విమర్శించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ఈ నేపథ్యంలో దాదాపుగా టాలీవుడ్ మొత్తం మాట్లాడింది. తాజాగా ఆ విమర్శలు ఎదుర్కొన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది.
కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆ మాటలు పడ్డ అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సురేఖ విమర్శల్లో వినిపించిన మరో హీరోయిన్ రకుల్ కూడా మాట్లాడింది.
సృజనాత్మకత, వృత్తి నైపుణ్యానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ అందమైన పరిశ్రమలో నా ప్రయాణమూ చాలా గొప్పది. అలాంటి పరిశ్రమలో మహిళల గురించి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనసు విరిచేసింది. మా మౌనాన్ని బలహీనత అనుకుంటున్నారు అని అంది రకుల్.
నాకు ఏ వ్యక్తి / రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును ఇలా ఉపయోగించడం మానేయండి. మీ రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయొద్దు. నటులను రాజకీయాల నుండి దూరంగా ఉంచాలి అని రకుల్ తన పోస్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో సురేఖ ఏమన్నా రకుల్‌కి రిప్లై ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే సమంత ఇలానే స్పందిస్తే.. ఆమె రియాక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఏమంటారో చూడాలి. లేదంటే రకుల్ కూడా నోటీసుల వరకు వెళ్తుందేమో చూడాలి.