ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్ (Ram Charan) జన్మదినం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఏటా చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏం జరిగింది, ఎలా చేసుకున్నారు అనే వివరాలు బయటకు రాలేదు. అయితే శనివారం సాయంత్రం రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి దిగిన ఫొటోలను ఇన్‌స్ట్రామ్‌లో షేర్ చేశారు. దాంతోపాటు వేడుకకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మార్చి 27 ఎప్పటికీ సంతోషకరమైన రోజు. మీరంతా విచ్చేసి ఈ రోజును మరింత ప్రత్యేకం చేశారు అని ఉపాసన ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో పాటు రాసుకొచ్చారు. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో చిరంజీవి (Chiranjeevi) , సురేఖ, సుస్మిత తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతోపాటు చిరంజీవి స్నేహితులు నాగార్జున(Nagarjuna) , ఇతర సన్నిహితులు, స్నేహితులు కూడా ఉన్నారు. మరో ఫొటోలో రామ్‌చరణ్ సన్నిహితులు విక్రమ్ తదితర స్నేహితుల కుటుంబసభ్యులు ఉన్నారు. వారందరికీ ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.
ఆ ఫొటోలను పరిశీలిస్తే ఈ కార్యక్రమం ఓ రిసార్ట్స్‌లో జరిగినట్లు ఉంది. చరణ్, అతని సన్నిహితులు క్యాజువల్ లుక్స్‌లో ఉన్నారు. చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు కనిపిస్తున్నాయి. లైటింగ్ బట్టి చూస్తే ఈ కార్యక్రమం రాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక దిగిన ఫొటోల్లో ఓ స్పెషల్ ఫ్రేమ్ కూడా కనిపిస్తోంది. అంటే ఏర్పాట్లు భారీగానే జరిగాయి అని అర్థమవుతోంది. మరికొన్ని ఫొటోలు త్వరలో బయటకు వస్తాయేమో చూడాలి.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే, బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’(Peddi) సినిమా రూపొందనుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవల విడుదల చేస్తే మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడని సమాచారం.