సినిమా అన్నాక ఫ్లాష్ బ్యాక్ కామన్. కొన్నిసార్లు మెయిన్ కంటెంట్ కంటే ఫ్లాష్ బ్యాక్ కంటెంటే హైలైట్ అవుతూ ఉంటుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోయింది అనే మాటలు మనం వింటూ ఉంటాం. రీసెంట్‌గా అలాంటి మాటలు వినిపించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్‌చరణ్ అప్పన్న, రామ్ నందన్ అనే రెండు పాత్రల్లో కనిపించాడు. రెండు పాత్రలకూ పేరొచ్చినా తొలి క్యారెక్టర్‌కి ఎక్కువ వచ్చింది అని చెప్పాలి.
సినిమాలో రామ్‌చరణ్.. అప్పన్న అనే సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా కనిపించాడు. డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్, నత్తి, కొత్త లుక్ ఇలా అన్నీ కలిపి చరణ్ ఆ పాత్రలో కొత్తగా కనిపించాడు. ఇంకా చెప్పాలంటే చరణ్ కెరీర్‌లో ది బెస్ట్ అనిపించుకునే పాత్రల లిస్ట్ రాస్తే ఆ పాత్ర టాప్ 3లో ఉంటుంది. అంతగా ఆ పాత్ర నచ్చేసింది అతని అభిమానులకు, ప్రేక్షకులకు. దీంతో కొత్త వాదన, కోరిక పుట్టుకొచ్చాయి.
‘గేమ్ ఛేంజర్’ సినిమా చూసినవాళ్లు అప్పన్న పాత్రపై ప్రశంసలు కురిపించడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఆ పాత్రలోని అమాయకత్వం, భావిద్వేగాలు బాగా పండాయి. దీంతో అప్పన్న పాత్రపై సోలోగా ఓ సినిమా వచ్చినా బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీసుకొని ప్రీక్వెల్ చేయొచ్చు అని మరికొందరు సూచిస్తున్నారు. నిజానికి వాళ్ల కోరికా నిజమే. ఎందుకంటే అప్పన్న జీవితాన్ని మొత్తంగా చూపిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.
సగటు తెలుగు కమర్షియల్ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అప్పన్న పాత్రలో ఉన్నాయి. మరి ఈ విషయంలో శంకర్ ఏమన్నా ఆలోచన చేస్తారేమో చూడాలి. లేదంటే ఎవరైనా అప్పన్న పాత్రను ఆదర్శంగా తీసుకొని ఓ కథ రాసుకుని చరణ్ దగ్గరకు వస్తే బాగుండు. ఎందుకంటే ఆ పాత్ర అలా పండింది మరి. పైనే చెప్పాంగా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆ పాత్ర అదిరింది.