శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొదటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. టీజర్, ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
ముఖ్యంగా కథనంలో లోపాలు, రొటీన్ స్క్రీన్‌ప్లే పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గేమ్ ఛేంజర్ అల్బమ్‌లో అత్యుత్తమంగా నిలిచిన నా నా హైరానా పాట తొలగించడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పాటను థియేటర్లలో చూసేందుకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యారు. పాటను సినిమా విడుదలకు ముందు తొలగించి, తర్వాత జనవరి 14న తిరిగి థియేటర్లలో జోడించాలని దిల్ రాజు తీసుకున్న నిర్ణయం విమర్శలకు గురైంది.
అయితే ఈ స్ట్రాటజీ కలెక్షన్లను పెంచడానికి ఉపయోగపడకపోవడం నిర్మాతలకు నిరాశను మిగిల్చింది. ఇందుకు తోడు, ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకుల్లో ప్రతికూల భావన పెరిగింది. ‘పాటను తొలగించడమే తప్పు, అది ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ప్రధాన ఎలిమెంట్ కావాలి.. అంటూ సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు. పైగా, సినిమా ప్రమోషన్ సమయంలో ఈ విషయాన్ని ముందుగా వెల్లడించకపోవడం ప్రేక్షకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. టాక్ నెగిటివ్‌గా మారటంతో కలెక్షన్ల పరంగా కూడా తీవ్ర ప్రభావం చూపింది.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సినిమా అనుకున్న స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోవడం దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ త్రయం మీద ప్రశ్నలు లేవనేత్తింది. ప్రేక్షకులను అలరించాల్సిన పాటను తొలగించడం, సరైన ప్రణాళికలతో సినిమాను ముందుకు తీసుకెళ్లకపోవడం, అంతిమంగా గేమ్ ఛేంజర్ను బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌గా నిలిపేలా చేసిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.