మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా బాధ్యతలు విజయవంతంగా చేపడుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఖైదీ నంబర్ 150 సినిమాని నిర్మించి నిర్మాతగా తొలి ఘనవిజయాన్ని సొంతంచేసుకున్నారు. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలి స్వాతంత్ర సమరయోధుడిగా చిరంజీవి చెమటని చిందిస్తున్నారు. కొన్ని రోజులుగా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ లో షూటింగ్ సాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు జాము మూడు గంటల వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
కర్నూలులోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషువారిపై తన తిరుగుబాటును ప్రారంభించారు. ఆ ముఖ్యమైన చారిత్రిక ఘట్టాన్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, హ్యారీపోర్టర్, స్కై ఫాల్ వంటి అద్భుత చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పని చేసిన గ్రెగ్ పావెల్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ మొత్తం షెడ్యూల్ కి చరణ్ 40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీంతో సినిమా బడ్జెట్ 200 కోట్లకు చేరుకుంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేదు.