రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ రాజకీయ సామాజిక డ్రామాలో రామ్ చరణ్ విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారిగా రామ్ నందన్ పాత్రకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఈ పాత్రకు రియల్ లైఫ్ ప్రేరణ ఉండటం సినిమాకి మరింత ఆసక్తి రేపుతోంది.
ఈ పాత్ర రూపకల్పనలో తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ ప్రేరణగా తీసుకున్నారని సమాచారం. శేషన్ తన కెరీర్‌లో ‘పని బకాసురుడు’గా ప్రాచుర్యం పొందారు. అధికార వ్యవస్థలో తన కఠిన చర్యలు, ప్రజల పక్షంలో నిలిచిన తీరు ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. 1990లలో భారత ఎన్నికల కమిషనర్‌గా శేషన్ పనిచేసిన కాలం అప్పట్లో బాగా హైలెట్ అయ్యింది.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చడంలో ఆయన తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ వంటి అవకతవకలను నిరోధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. తన తీర్పుల్లో కన్ఫ్యూజన్ లేకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిన శేషన్ రాజకీయ వ్యవస్థలో దూసుకుపోయారు.
శేష్‌న్ తన బాధ్యతలు నిర్వర్తించే తీరు, తెగువను గేమ్ ఛేంజర్ లో రామ్ నందన్ పాత్ర ద్వారా శంకర్ చూపించారు. కథలో రాజకీయ వ్యవస్థలో అవినీతి, సామాజిక బాధ్యతల మధ్య జరిగే సంఘర్షణలు శేషన్ జీవితం నుంచి స్ఫూర్తి పొందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చరణ్ నటనతో పాత్రకు మరింత బలమిచ్చారు.