సినిమాల్లో చెప్పాల్సిన డైలాగ్‌లు.. బయట స్టేజీల మీద చెబితే బాగుంటుందా… ఏమో అంత బాగోదు అనే అనిపిస్తుంటుంది. తాజగా అలాంటి ఒక సినిమాటిక్ డైలాగ్‌ను వదిలాడు యువ కథానాయకుడు రాపో.. అదేనండి రామ్ పోతినేని. ‘రెడ్’ రిలీజైన సందర్భంగా ప్రచారంలో భాగంగా ఇటీవల విశాఖపట్నంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగానే రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల్లో ఉత్సాహం పంచడం ఆయన ఆలోచన అయ్యి ఉండొచ్చేమో కానీ… మిగిలిన హీరోలను తక్కువ చేసేలా ఆ మాటలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వినిపిస్తున్నాయి.
‘‘అందరం కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేశాం. సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం కిషోర్. మణిశర్మ గారితో ‘ఇస్మార్ట్ శంకర్’ చేశాను. మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేశాం. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది. మాళవిక చాలా బాగా నటించింది. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీశాం. రిలీజ్‌కు ముందు మేం కొంచెం టెన్షన్ పడ్డాం. రివ్యూలు ఎలా వస్తాయో, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని ఆలోచనలో పడ్డాం. కానీ మీరంతా సినిమాను ఆదరించారు. 15 ఏళ్ల క్రితం సంక్రాంతికి ‘దేవదాస్’తో వచ్చాను’’ అంటూ తన సినిమా విజయం ఇచ్చిన ఆనందాన్ని పంచుకున్నాడు రామ్.
రామ్‌ను చాలా మంది ‘మీకు పోటీ ఎవరని?’ అడుగుతుండేవారట. దానికి కూడా ఇదే వేదికపై సమాధానం ఇచ్చాడు. ‘‘నాకు పోటీ ఎవరో ఇప్పుడు అర్థమైంది. మీరే (అభిమానులే) నాకు నిజమైన పోటీ. మీరు నాపై చూపించే ప్రేమ ఎక్కువ? లేక స్క్రీన్‌పై నేను చూపించే ప్రేమ ఎక్కవ అనేదే నాకు ముఖ్యం. అందుకే మీరే నాకు పోటీ’’ అని చెప్పుకొచ్చాడు రామ్. అంతా బాగుంది కానీ… అందరూ అడిగే ప్రశ్న. ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు అని… దానికి రామ్ ఇలా సమాధానం చెప్పడం ఏంటో.. పోటీ ఉంటే ఉన్నారనాలి… లేరంటే లేరనాలి. అంతేకానీ… ఇలా చెప్పడం ఏంటో.