“నేను పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తాను” అని వర్మ ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పిన మాట మీద మంచం వేసుకొని మరీ కూర్చున్నట్లున్నాడు. తనకు సంబంధం లేని సినిమాల మీదే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే రాంగోపాల్ వర్మ తన సొంత సినిమా ప్రమోషన్ అనేసరికి ఇంకాస్త కిందకి దిగజారాడు. తన ప్రొడక్షన్ లో తన శిష్యుడు తెరకెక్కించిన “భైరవగీత” అనే చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్ 30న ఏకకాలంలో విడుదలకానుంది. నిజానికి ఈ చిత్రాన్ని నవంబర్ 23న విడుదల చేద్దామనుకున్నప్పటికీ.. నవంబర్ 30కి పోస్ట్ పోన్ చేశారు. సరిగ్గా ఒకరోజు ముందు అనగా నవంబర్ 29న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “రోబో 2.0” విడుదలవుతుండడంతో.. రోబో 2.0 మరియు భైరవగీత చిత్రాలను కంపేర్ చేస్తూ ట్వీట్స్ వేయడం మొదలెట్టాడు వర్మ.
“రోబో 2.0 చిన్న పిల్లల కోసం శంకర్ అనే పెద్ద డైరెక్టర్ తీసిన సినిమా, “భైరవగీత” పెద్దల కోసం చాలా చిన్న పిల్లాడు తీసిన సినిమా” అని వర్మ పెట్టిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా కంటెంట్ ఉందో లేదో తెలియదు కానీ.. వర్మ “భైరవగీత” సినిమా విషయంలో తీసుకొంటున్న జాగ్రత్తలు కానీ.. చేస్తున్న అతి కానీ చిరాకు తెప్పిస్తున్నాయి. నవంబర్ 30 వరకూ ఈ వర్మ ఆగడాలను భరించక తప్పదు.. ఆ తర్వాత రిజల్ట్ బట్టి వర్మ ఎలాగూ సైలెంట్ అయిపోతాడనుకోండి.