‘లక్ష్యం’, ‘లౌక్యం’ బాటలోనే ‘రామబాణం’ విజయం సాధిస్తుంది: నిర్మాత టీజీ విశ్వప్రసాద్

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పీపుల్ మీడియా సినిమా అంటే ఒక బ్రాండ్ లా అయిపోయింది.. ఈ సినిమాపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి?
బ్రాండ్ కంటే కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. రామబాణం మూవీ అలాగే తీశాం. శ్రీవాస్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అనిపించింది.

లక్ష్యం, లౌక్యం తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కదా.. ఎలాంటి కృషి చేశారు?.
ప్రొడక్షన్ సైడ్ మేం చేయాల్సింది చేశాం. మా పూర్తి సహకారం అందించాం. శ్రీవాస్ గారు దీనిని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించాలి అనుకున్నారు. బ్రదర్ సెంటిమెంట్ మీద రన్ అవుతుంది ఈ సినిమా. లక్ష్యం, లౌక్యం సినిమాల తరహాలోనే యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెట్ కూడా ఉంటుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?.
మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేయడమే ఫ్యాక్టరీ మోడల్ లో ప్రారంభించాం. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చాలా రీసెర్చ్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా.. ఒకేసారి ఎక్కువ సినిమాలు తీస్తూ, ఒకటి కాకపోతే మరొకటి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. మాకు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలోకి కేవలం వ్యాపారం కోణంలో కాకుండా, సినిమా మీద ఉన్న ఇష్టంతో అడుగుపెట్టాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదిగాం.

‘రామబాణం’ టైటిల్ ని బాలకృష్ణ సూచించారని పెట్టారా?
ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ ని పరిశీలించాము. బాలకృష్ణ గారు ‘రామబాణం’ టైటిల్ సూచించారు. ఇది అన్నదమ్ముల కథ కావడంతో, టైటిల్ సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతో ‘రామబాణం’ని ఖరారు చేశాము.

మీ సినిమాల ఎంపిక ఎలా జరుగుతుంది?
సినిమాల ఎంపికకు అంటూ ప్రత్యేకంగా ఒక ఫార్ములా లేదు. కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక సినిమాని ప్రారంభించడానికి ముందే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఒక్కసారి సినిమా మొదలయ్యాక క్రియేటివ్ సైడ్ దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాము.

రామబాణం ప్రొడక్షన్ కి ఎంత సమయం పట్టింది?.. అవుట్ పుట్ మీకు సంతృప్తినిచ్చిందా?
స్ట్రైక్ మరియు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సినిమా ప్రొడక్షన్ దాదాపు ఒక ఏడాది జరిగింది. అయితే అవుట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.

విజయాలను, పరాజయాలను ఎలా చూస్తారు?
విజయం మన చేతుల్లో ఉండదు. అయితే విజయం కోసం వంద శాతం మన ప్రయత్నం మనం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం విజయాల శాతం ఎక్కువగానే ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న జోనర్ల చిత్రాలను ప్రేక్షకులకు అందించాలి అనుకుంటున్నాం.

మీ వారసులను కూడా సినిమా రంగంలోకి తీసుకొస్తున్నారా?
మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి మాత్రం సినిమాపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం శర్వానంద్ గారితో చేస్తున్న ఒక సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది.

వెన్నెల కిషోర్ హోస్ట్ గా ‘అలా మొదలైంది’ అనే షోతో టీవీ రంగంలోకి అడుగు పెట్టడం ఎలా ఉంది?
నిజానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రారంభంలోనే టీవీ రంగంలోకి అడుగుపెట్టాం. ఈటీవీలో మూడు సంవత్సరాల పాటు ‘పాడుతా తీయగా’ కార్యక్రమం చేశాము. అప్పటి నుంచే టీవీ షోలపై ఆసక్తి ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం.

సినిమాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
సినిమానే నాకు స్ఫూర్తి అండి. నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టే సమయానికి చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. వాటిలో మా ప్రత్యేకతను చాటుకోవడానికి ముందునుంచే పక్కా ప్రణాళికతో అడుగు పెట్టాము.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus