ఇదివరకూ సినిమాలోని ఏదో ఒక డైలాగునో లేక పాటలోని పల్లవినో తీసుకొని టైటిల్స్ గా పెట్టేవాళ్లు. ఆ తర్వాత హీరోహీరోయిన్ల పేర్లు టైటిల్స్ గా పెట్టడం మొదలైంది. ఇప్పుడు బైకులు, కార్ల పేర్లు కూడా టైటిల్స్ గా వచ్చేస్తున్నాయనుకోండి. అయితే.. ఈమధ్యకాలంలో టైటిల్ జస్టిఫికేషన్ లేని సినిమాలు ఎక్కువైపోతున్నాయి. ఆమధ్య వచ్చిన “నోటా” సినిమా పరిస్థితే ఇందుకు నిదర్శనం. అయితే.. నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన “రామ చక్కని సీత” అనే పోస్టర్ చూసినవాళ్లు మాత్రం “ఆ పోస్టర్ కి, ఆ టైటిల్ కి ఏమైనా సింక్ అయ్యిందా?” అని ప్రశ్నిస్తున్నారు.
కొత్త హీరోహీరోయిన్లతో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో వర్షంలో బీరు తాగుతూ ఏదో పార్క్ లో షర్ట్ లేకుండా కూర్చున్న ఫోటోను రిలీజ్ చేశారు. ఏ యాంగిల్లో చూసినా పోస్టర్ కి, టైటిల్ కి సింక్ అవ్వడం లేదు. ఏదైనా రొటీన్ టైటిల్ పెట్టేసి ఉంటే ఈ పోస్టర్ గురించి అసలు చర్చ కూడా అవసరం లేదు. కానీ.. “రామ చక్కని సీత” అనే మంచి టైటిల్ ను పాడు చేయడం తప్ప ఆ దర్శకనిర్మాతల ఏం చేస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. ఏంటో ఈ వింత పోకడ.