బాహుబలిలో భల్లాల దేవుడి పాత్ర దగ్గుబాటి రానాకు మంచి గుర్తింపుతో పాటు, చేతినిండా సినిమాలను తెచ్చి పెట్టాయి. లీడర్ ద్వారా హీరోగా రానా సినిమాల్లోకి అడుగు పెట్టారు. నేను నా రాక్షసి, నా ఇష్టం చిత్రాలు చేసారు. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ కొంత మేర విజయం సాధించింది. తర్వాత బాహుబలి చిత్రంలో విలన్ గా తన నట విశ్వ రూపం చూపించారు. దీంతో తెలుగు పరిశ్రమతో బాటు హింది, తమిళ్ చిత్ర పరిశ్రమల చూపు రానా ఫై పడింది.
ఒక వైపు బాహుబలి – 2 చిత్రీకరణలో పాల్గొంటూనే సంకల్ప్ దర్శకత్వంలో ఒకే సారి హింది, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటున్న”ఘాజి” సినిమాలో నటించారు. యుద్ధ నేపధ్యం లో సాగే ఈ మూవీలో నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తాప్సీ హీరోయిన్. పీవీపీ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కానుంది. తేజ దర్శకత్వంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని తెలుగు సినిమాలో కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేయనున్నారు. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ షూట్ కూడా పూర్తి అయ్యింది. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.
ఈ సినిమా అయిపోయిన వెంటనే రానా తమిళ్ మూవీ లో నటించేందుకు అంతా సిద్ధం చేసారు. డైరక్టర్ బాలా చెప్పిన స్క్రిప్ట్ తనకి బాగా నచ్చిందని, వీలైంత త్వరలో అతనితో సినిమా చేయనున్నట్లు రానా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇలా భాషా భేదం లేకుండా రానా దూసుకుపోతున్నారు. ఈ సినిమాలు హిట్ సాధిస్తే రానా హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు.