‘రానా నాయుడు’… టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం. వెంకటేశ్ నుండి ఇలాంటి వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది అనే విషయం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుండి అలాంటి కంటెంట్ రావడం ఎవరూ అనుకోలేదు. రానా యాక్షన్ హీరోగా చేస్తే బాగుండు అనుకున్నారు తప్ప.. మరీ ఇంతలా ఇబ్బందికరంగా ఉంటే ఎలా అని అన్నారు. దానికితోడు తండ్రీ కొడుకుల వరుసకు వచ్చే ఇద్దరూ కలసి ఇలాంటి సిరీస్ చేయడం సరికాదు అనే మాట కూడా వినిపించింది.
ఎందుకు అంటే.. ఈ సిరీస్‌లో బూతులు, అసభ్యకరమైన కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో అభిమానులు ఇబ్బంది పడుతూనే చూసేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ కూడా ఏదో ఇబ్బంది పడుతోంది అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వెర్షన్ లేదు. అంటే ఈ సిరీస్ ఆడియో వెర్షన్‌లో తెలుగును తీసేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 10న తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్‌కు తెలుగు ఆడియోను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది.
అయితే, ఈ (Rana Naidu) తొలగింపునకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ సిరీస్‌ను ఇప్పుడు చూడాలనుకుంటున్న తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. దీనిపై నెటిజన్లు ఇప్పటికే మీమ్స్‌తో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై సదరు సంస్థ స్పందించలేదు. అసభ్య పదజాలం, అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలే దీనికి కారణం అని కూడా అంటున్నారు. లేకపోతే సాంకేతిక సమస్య ఏమైనా ఉందా? అనే డిస్కషన్ కూడా నడుస్తోంది.
నిజానికి ఈ సిరీస్‌స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుండే తెలుగులో విమర్శలు వస్తున్నాయి. ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చాలామంది కోరారు. అయితే ఇన్నాళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడేం వచ్చింది, ఇప్పుడెందుకు తీసేశారు అనేది తెలియడం లేదు. దీనిపై టీమ్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. లేకపోతే సురేశ్ ప్రొడక్షన్స్ నుండి ఏమైనా సమాచారం ఇవ్వాలి.