టాలీవుడ్‌లో హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు, కాస్త లక్ కూడా కలిసి రావాలి. ‘మిస్టర్ బచ్చన్’ నుంచి నిన్నటి ‘కాంత’ వరకు భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇంకా సాలిడ్ హిట్ తగలలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ త్వరలో రాబోతున్న రామ్ పోతినేని సినిమాపైనే ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గుసగుసలు మొదలయ్యాయి.
Bhagyashri Borse
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్ సమయంలో రామ్, భాగ్యశ్రీ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది స్నేహం దాటి ప్రేమగా మారిందని సోషల్ మీడియా కోడై కూసింది. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి, ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఏదో ఉందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఇన్నాళ్లు ఈ వార్తలపై సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఈ రూమర్లన్నింటికీ ఒక్క దెబ్బతో చెక్ పెట్టేసింది.
రామ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని భాగ్యశ్రీ కుండబద్దలు కొట్టింది. ఒక నటుడిగా రామ్ అంటే తనకు చాలా గౌరవమని, సెట్స్‌లో ఆయన డెడికేషన్ చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. అంతకు మించి తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ లేదని స్పష్టం చేసింది. కేవలం కో స్టార్స్ మధ్య ఉండే స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ గాసిప్స్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.
అయితే ఇదే ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని చెబుతూనే, భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని మనసులో మాట బయటపెట్టింది. ప్రేమ మీద తనకు విపరీతమైన నమ్మకం ఉందని, తనను అర్థం చేసుకునేవాడు ఖచ్చితంగా దొరుకుతాడనే ఆశతో ఉన్నట్లు తెలిపింది. భాగ్యశ్రీ ఫోకస్ అంతా ఇప్పుడు తన కెరీర్ మీదే ఉంది. నవంబర్ 28న రాబోతున్న ఈ సినిమాతో అయినా ఆమెకు బ్రేక్ వచ్చి, స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్తుందో లేదో చూడాలి.
