ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా హిందీ రైట్స్ అమ్ముడవగా ఈ సినిమాకు ఏకంగా 80 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీలో పుష్ప ది రైజ్ ను విడుదల చేయాలని బన్నీ మంచి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి. అయితే బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా కూడా హిందీలో రిలీజ్ కానుంది.
అల వైకుంఠపురములో సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత హిందీలో డబ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రైజ్ ద్వారా వచ్చిన క్రేజ్ అల వైకుంఠపురములో సినిమాను హిందీలో రిలీజ్ చేస్తే తగ్గే ఛాన్స్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అల వైకుంఠపురములో హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. అయితే చరణ్ నటించి తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమా కూడా హిందీలో డబ్ అవుతోంది.
బన్నీ సినిమా రిలీజైన తర్వాత చరణ్ సినిమా హిందీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం రంగస్థలం హిందీ వెర్షన్ కు సంబంధించి డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే చరణ్ అభిమానులు మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి సిరీస్ హిందీలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు హిందీలో ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై సత్తా చాటాయి.
తెలుగు సినిమాలకు హిందీలో ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో అక్కడి థియేటర్లలో తెలుగులో హిట్టైన సినిమాలను రిలీజ్ చేయడానికి హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాసినిమాకు టాలీవుడ్ హీరోలు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. అల వైకుంఠపురములో, రంగస్థలం హిందీలో సక్సెస్ సాధిస్తే మరిన్ని టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ బాట పట్టే ఛాన్స్ ఉంది. మాస్ సినిమాలకు హిందీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వల్లే ఈ సినిమాలకు హిందీలో ఊహించని స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. చరణ్ కు గతంలో జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో చేదు ఫలితం రాగా భవిష్యత్తు సినిమాలతో చరణ్ అక్కడ సత్తా చాటుతారని అభిమానులు భావిస్తున్నారు.