సోషల్ మీడియా వల్ల వచ్చే ఉపయోగాలేంటి.. అని అని అడిగితే లిస్ట్ రాస్తే మహా అయితే పేజీ దాటదు. అదే వచ్చే సమస్యలు ఏంటి అని అడిగితే.. ఆ లిస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. అందులో ముఖ్యమైన అంశం ‘లేనిపోని విమర్శలు’. దీని వల్ల ఎక్కువగా ఇబ్బందిపడుతున్న వాళ్లు అంటే కథానాయికలు, నటీమణులే అని చెప్పాలి. చిన్న విషయానికే హీరోయిన్లపై, నటీమణులపై బురద జల్లుతుంటారు. అయితే వాటికి కొంతమంది నాయికలు గట్టిగానే రిప్లై ఇస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ చేసింది.
సోషల్ మీడియాను మన సినిమా జనాలు బాగానే ఫాలో అవుతుంటారు. దాని కోసం కొంతమంది టీమ్‌ను కూడా పెట్టి ఉంటారు. ఈ క్రమంలో ఏవైనా బాగా నొచ్చుకున్న పోస్ట్‌లు, మీమ్స్ లాంటివి కనిపిస్తే.. రిటార్ట్ చాలా గట్టిగా ఇస్తారు. తాజాగా తెలుగు నటీమణుల గురించి ఓ నెటిజన్ ఇబ్బందికరంగా మీమ్ చేశారు. తెలుగు టీవీ యాంకర్ల ఫొటోల కొలేజ్‌ను షేర్ చేస్తూ.. ‘‘వాళ్లు యాంకర్స్ కాదు మావ.. హీరోయిన్స్ ఎలా అవ్వాలో తెలియక ఉండిపోయిన హీరోయిన్స్ రా మావ’’ అని రాశారు.
ఆ మీమ్‌ను రష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలా పెడుతూ.. ‘‘ఇది నిజమండీ.. అయితే మీరు ఇంకో కామన్ పాయింట్ మిస్ చేశారు. ఫొటోలో ఉన్న అమ్మాయిలు తెలుగు ప్రాంతాల్లో పుట్టినవారు. వాళ్లకు బాంబే బోర్డింగ్ పాస్ ఉండుంటే కథ వేరేగా ఉండేదేమో. అప్పుడు మేము వేసుకునే బట్టలు ట్రెండ్ సెట్టింగ్‌గా ఉండేవేమో’’ అని రాశారు. అయితే దానికి కూడా నెటిజన్ల నుండి కౌంటర్లు మొదలయ్యాయి. ‘‘తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని… మీరు తెలుగు ప్రాంతాల్లో పుట్టారని చెప్పుకోవడం వల్ల సానుభూతి రాదు’’ అని అన్నాడు.
దానికి కూడా రష్మీ సమాధానం ఇచ్చారు. ‘గ్రూపిజం లేకుండా ఉండేందుకు ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించని నేను సీబీఎస్‌ఈ స్కూల్లోనే చదివాను. కాబట్టి మీరు నాపై నింద మోపలేరు. నా తల్లి ఒడియా, తండ్రి ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారు. అలా విభిన్న ప్రాంతాలకు చెందినవారి బిడ్డగా… అందరిలాగానే నా మాటల్లోనూ కాస్త ఆ యాస వినిపిస్తుంది’’ అని అంది రష్మీ. ఇలా మహిళా నటుల గురించి కామెంట్లు చేయడం, వాళ్లు రిప్లై ఇవ్వడం కొత్తేం కాదు. కానీ ఇది ఎక్కడో దగ్గర ఆగితే బాగుంటుంది అని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు.