ఈ మధ్య టాలీవుడ్ ను కూడా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నామధ్య ‘యజ్ఞం’ దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూశారు. ఇటీవల అయితే దిగ్గజ నటులు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఈ విషాదాల నుండి ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు నిన్న రాత్రి అంటే జూలై 15న మృతి చెందారు.
హైదరాబాదులో ఉన్న రవితేజ నివాసంలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన వయస్సు 90 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆయన వయోభారంతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. నిన్న రాత్రి పరిస్థితి విషమించడం వల్ల ఆయన ప్రాణం విడిచినట్టు తెలుస్తుంది. రాజగోపాల్ రాజు ఫార్మసిస్టుగా పనిచేశారు. ఆయన భార్య అంటే రవితేజ తల్లి పేరు రాజ్యలక్ష్మి. రాజగోపాల్ రాజు- రాజ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురూ కొడుకులే కావడం విశేషం.
వీరిలో రవితేజ పెద్దవాడు. రఘు రెండో వాడు, భరత్ మూడోవాడు. జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ వంటి ప్రాంతాల్లో రాజగోపాల్ రాజు పనిచేశారు. తరువాత విజయవాడకి షిఫ్ట్ అయ్యారు. అయితే రాజగోపాల్ రాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఖండవల్లి గ్రామం అనే చెప్పాలి. ఇక రాజగోపాల్ రాజు మరణ వార్త విని రవితేజ అభిమానులు షాక్ అవుతున్నారు. ‘స్టే స్ట్రాంగ్ అన్నా’ అంటూ తమ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.