మాస్ రాజా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడింది. ‘ధమాకా’ తర్వాత హిట్ అనే పదానికి ఆయన చాలా దూరమైపోయారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. లేటెస్ట్ గా వచ్చిన ‘మాస్ జాతర’ కూడా నిరాశపరచడంతో రవితేజ మార్కెట్ మీద గట్టి దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాబోయే సంక్రాంతి మీదే ఉన్నాయి.
నిజానికి ఈసారి సంక్రాంతి రేసులో చిరంజీవి, ప్రభాస్ లాంటి బడా స్టార్లు ఉన్నారు. వాళ్ళతో పోటీ పడటం అంటే సాహసమే. కానీ రవితేజ వెనకడుగు వేయడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయనకున్న ‘సంక్రాంతి సెంటిమెంట్’. గతంలో సరిగ్గా ఇలాగే వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు, 14 ఏళ్ల క్రితం ‘మిరపకాయ్’ సినిమా సంక్రాంతికి వచ్చి ఆయన కెరీర్ కు ఊపిరి పోసింది. అలాగే 2021లో ‘క్రాక్’ కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిచి రవితేజను రేసులోకి తెచ్చింది. ఇప్పుడు 2026లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
అయితే ఈసారి రవితేజ కేవలం సీజన్ ని మాత్రమే నమ్ముకోలేదు, తన రూట్ కూడా మార్చారు. ఇన్నాళ్లు చేసిన హెవీ యాక్షన్, మేకప్ సినిమాలను పక్కన పెట్టి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఒక క్లాస్ టైటిల్ తో వస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల ట్రాక్ రికార్డ్ ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్. ఆయన సినిమాల్లో ఉండే సెన్సిబిలిటీ, ఫ్యామిలీ ఎమోషన్స్ రవితేజకు ఇప్పుడు చాలా అవసరం.
రవితేజను ఊర మాస్ గా చూసి జనం బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే కిషోర్ తిరుమల ఈసారి రవితేజను చాలా కూల్ గా, వింటేజ్ స్టైల్ లో చూపించబోతున్నారట. వరుస వైఫల్యాల నుంచి బయటపడాలంటే రవితేజకు ఇప్పుడు కావాల్సింది భారీ యాక్షన్ కాదు, బలమైన కథ. ఆ విషయంలో ఈ సినిమా మీద ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా టీజర్, ట్రైలర్ రాలేదు కానీ.. టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే ఆడియన్స్ లో ఒక ఆసక్తి కలిగింది. సంక్రాంతి సెంటిమెంట్ తో పాటు, ఈ జానర్ మార్పు రవితేజకు కలిసొస్తే.. మళ్ళీ మాస్ రాజా ట్రాక్ లో పడినట్లే.
