ఓ సినిమా హక్కులు కొనుక్కుంటున్నారు అంటే.. అన్ని రకాలుగా లెక్కలేసుకొని, కష్టనష్టాలు చూసుకొని తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఆ కథకు విలువ ఉందా? ఇలాంటి స్టోరీ మనవాళ్లు చూస్తారా? ఆ నేటివిటీ ఈ నేటివిటీ అంటూ చాలా లెక్కలు వేసుకోవాలి. అయితే ఇప్పుడు వీటికితోడు మరొక అంశం, ఇంకా చెప్పాలంటే కీలకమైన అంశం కచ్చితంగా చూసుకోవాలి. అదే ఓటీటీలో ఆ సినిమా తెలుగు వెర్షన్ ఉందా? లేకపోతే పెడతారా? అని. ఎందుకంటే ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఈ ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి.
మలయాళంలో విడుదలైన సినిమాలు, ముఖ్యంగా ప్రేమ కథల్ని మనవాళ్లు అస్సలు వదలడం లేదు. నిర్మాతలు, దర్శకులు ఓ పక్క కథల్ని కొనేయడానికి సిద్ధమవుతుంటే, మన సినిమా ప్రేక్షకులు వాటిని సబ్‌టైటిల్స్‌తో చూసేయడానికి ముందుకొస్తున్నారు. ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంది అంటే ఇంకా రెడీ అవుతున్నారు. దీంతో మలయాళం సినిమాలకు తెలుగునాట ఓటీటీలో మంచి విలువ కనిపిస్తోంది. అందుకే ఓ ప్రముఖ ఓటీటీ మలయాళ సినిమాల్ని వరుసగా కొనేసి వారానికొకటి స్పెషల్ అంటూ విడుదల చేస్తోంది.
వాటి వరకు అదే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దాం అనుకొని హక్కులు కొనేవాళ్లకు ఇబ్బంది వస్తోంది. టోవినో థామస్ నటించిన ‘తళ్ళుమాల’ మలయాళంలో అదరగొట్టేసింది. సుమారు రూ. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఏకంగా రూ. వంద కోట్ల గ్రాస్ సాధించిందట. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి హక్కులు కూడా తీసుకొచ్చారట.
ఇక్కడివరకు అంతా ఓకే కానీ ఆ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. మలయాళ వెర్షన్ మాత్రమే కాదు.. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో చూసిన సినిమానే మళ్లీ చూడాలా అని అంటున్నారు. ఇదొక్కటే కాదు మొన్నీ మధ్య వచ్చిన ‘మానాడు’, ‘లూసిఫర్’ పరిస్థితి కూడా అంతే. అంతకుముందు ‘కాటమరాయుడు’ పరిస్థితీ అంతే. దీంతో సినిమా హక్కులు కొనుక్కునేటప్పుడు ఓటీటీ డబ్బింగ్ రైట్స్ సంగతి కూడా ఓ సారి చూసుకుంటే మంచిది అని అంటున్నారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!