Renukaswamy Murder Case: చేసింది కొండంత.. చెప్పింది గోరంత.. దారుణంగా హత్య చేసిన దర్శన్‌

ప్రముఖ శాండిల్‌వుడ్‌ నటుడు దర్శన్‌ (Darshan) అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నటి పవిత్ర గౌడ చెప్పినట్లు దర్శన్‌కు ఈ విషయం చెప్పడమే అతి పెద్ద తప్పు అని అర్థమవుతోంది. హత్యకు ముందు రేణుకా స్వామిని చిత్ర హింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. రేణుకా స్వామికి కరెంటు షాక్‌ ఇచ్చినట్లు నివేదికలో తేలింది. హత్య కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు మాండ్యాకు చెందిన కేబుల్‌ వర్కర్‌ ధన్‌రాజ్‌ అనే ఇటీవల అరెస్టు చేశారు.

తనను నందీశ్‌ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లాడని ధన్‌రాజ్‌ చెప్పాడు. అక్కడే రేణుకాస్వామికి కరెంటు షాక్‌ ఇవ్వడానికి ఏర్పాటు చేశామని తెలిపాడు. రేణుకా స్వామి తాను శాకాహారినని చెప్పినా వినకుండా బలవంతంగా బిర్యానీ తినిపించారని కూడా విచారణలో తేలింది. ఈ క్రమంలో రేణుకా స్వామిపై పవిత్ర గౌడ, దర్శన్‌తోపాటు మరికొందరు దాడి చేసినట్లు సమాచారం.

బాధితుడి శరీరంపై 39 గాయాలు అవ్వగా, వీటిలో ఎనిమిదిచోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు విచారణలో భాగంగా గుర్తించారు. రేణుకా స్వామిపై మొదట పవిత్ర గౌడ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోసారి తప్పు చేయనని, తనను హింసించొద్దని రేణుకా స్వామి ఆమె కాళ్లపై పడి వేడుకున్నా వినలేదట. అంతేకాదు హత్య అనంతరం రేణుకా స్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నట్లు భోగట్టా.

ఆయన హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్‌ దేవరాజ్‌ ఘటనా స్థలంలోనే ఉన్నాడని తేలడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. దర్శన్ మేనేజర్ శ్రీధర్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిందని సమాచారం. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీధర్‌ లేఖ, వీడియోలో పేర్కొన్నారు.

అలాగే తన చావుకు ఎవరూ కారణం కాదని కూడా తెలిపారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే రేణుకా స్వామికి రెండు దెబ్బలు మాత్రమే వేశాను అని దర్శన్‌ చెప్పడం గమనార్హం. అయితే అవి రెండు దెబ్బలు కావని, చిత్ర హింసలు పెట్టారని ఇప్పుడు తేలింది. దీంతో ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో అనే చర్చ మొదలైంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus