యమున… సినిమాల్లో నటించి ఎంతమంది దగ్గరయ్యారో, సీరియళ్లలో నటించి అంతకుమించి దగ్గరయ్యారు అని చెప్పాలి. హోమ్లీ పాత్రలు, అల్లరి పాత్రలు చేస్తూ అందరి ఇళ్లలో మనిషిలా మారిపోయారు. 1989లో ‘మౌనపోరాటం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యమున… తెలుగుతోపాటు, మలయాళ, కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో నటించారు. ఆ తర్వాత టీవీ సీరియళ్లలోనూ తనదైన శైలిలో పాత్రలుచేస్తూ మెప్పించారు. అయితే ఆమెకు ఈటీవీతో చాలామంచి అనుబంధం ఉంది. అందులో ఎన్నో సీరియళ్లలో నటించారు. అన్నింటా మంచి పేరే తెచ్చుకున్నారు.
అలా ఆమెకు రామోజీ ఫిల్మ్ సిటీతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో యమున రామోజీ ఫిలింసిటీతో తన అనుబంధాన్ని, ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో చేశారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో చూస్తే మీరు 30 నిమిషాల్లోనే రామోజీ ఫిలిం సిటీలోని ముఖ్యమైన ప్రదేశాలను చూసేయొచ్చు. దాంతోపాటు ఫిలిం సిటీతో, ఆ యాజమాన్యంతో తనకున్న అనుబంధాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈటీవీ, ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘అన్వేషిత’, ‘విధి’ ‘అగ్నిగుండం’, ‘అల వైషు నిలయంలో’, తదితర సీరియళ్లలో యమున కీలక పాత్రలు పోషించారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్‌లోనూ ఆమె కీలక పాత్రధారి. ఈ సీరియళ్ల షూటింగ్‌లన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగాయి, జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సీరియల్స్ షూటింగ్ జరిగిన ప్రాంతాల్ని, రామోజీ ఫిలింసిటీ విశేషాలను ఆ వీడియోలో చూపించారు. ఈటీవీతో అనుబంధాన్ని వివరిస్తూ రామోజీరావుగారు తన మీద చూపించే వాత్సాల్యాన్ని కూడా చెప్పారు యమున. అలాగే దివంగత నటుడు, దర్శకుడు సుమన్ తనకు ఎన్నో మంచి పాత్రలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
తనని సోదరిలా చూసుకున్నారంటూ యమున ఓ సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు. ‘అన్వేషిత’ సీరియల్ కన్నా ముందు ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం తొలిసారి ఫిలింసిటీకి వచ్చానని అంటూ ఆ షూట్ జరిగిన ప్రదేశాన్ని చూపించారు యమున. తాను మేకప్ వేసుకనే గది, ఉండే తార హోటల్, తొలిసారి షూటింగ్ చేసిన భవనం, ఎక్కువ సార్లు చిత్రీకరణ జరిపిన ప్రాంతం ఇలా అన్నీ చూపించారు. కావాలంటే ఆ వీడియో మీరూ చూసేయండి.