మరణాంతరం తమ శరీరంలోని అవయవాలను దానం చేస్తుంటారు చాలా మంది. దీనివలన ఎంతరికో మేలు జరుగుతుంది. ఇటీవల కాలంలో నేత్రదానం, అవయవదానంపై జనాల్లో చైతన్యం పెరుగుతోంది. తాము చనిపోయినా.. ఏదో రకంగా గుర్తుండాలని చాలా మంది ఇలా అవయవాలను దానం చేస్తున్నారు. తాము మరణించిన తరువాత మృతదేహాన్ని వైద్యశాలకు అప్పగిస్తూ ముందస్తు ఒప్పంద పాత్రలపై సంతకాలు చేస్తుండడం తెలిసిందే. అయితే ఓ నటుడు మాత్రం తాను చనిపోయిన తరువాత మృతదేహాన్ని ఏం చేయాలో చెప్పిన విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.
బ్రిటన్ కి చెందిన నటుడు, దర్శకనిర్మాత రిక్కీ జెర్వీస్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నటుడు ‘ఆఫ్టర్ లైఫ్’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. గతేడాది ‘ఆఫ్టర్ లైఫ్ 2’ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో రిక్కీని ఓ ఛానెల్ వారు ఇంటర్వ్యూ చేశారు. ‘మీరు చనిపోయిన తరువాత మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు..?’ అని వ్యాఖ్యాత ప్రశ్నించగా.. దానికి రిక్కీ తన మృతదేహాన్ని లండన్ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా అందించాలని కోరాడు. తన మృతదేహం కనీసం అలాగైనా ఉపయోగపడుతుందని చెప్పి షాకిచ్చాడు.
తన వింత కోరికకు వివరణ కూడా ఇచ్చాడు. ప్రపంచం నుండి మనం అన్నీ తీసుకుంటున్నామని.. స్వేచ్ఛగా తిరిగే జంతువులను తింటున్నాం.. అడవులను నరికేస్తున్నాం.. అన్నింటినీ నాశనం చేస్తున్నాం.. కానీ తిరిగి ఏమీ ఇవ్వట్లేదని అన్నారు. అందుకే కనీసం తన మృతదేహాన్ని సింహాలను ఆహారంగా వేసి ఉపయోగపడాలనుకుంటున్నట్లు చెప్పారు. తన మృతదేహాన్ని సింహాలు తింటుంటే.. అక్కడికి వచ్చే సందర్శకుల ముఖాల్లోని ఫీలింగ్స్‌ను చూడాలని కూడా అతను చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.