2024 సంవత్సరం మలయాళ ఇండస్ట్రీకి కలిసొచ్చినట్లుగా మరెవరికీ కుదరలేదు. ఈ ఏడాది హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న మలయాళం సినిమా నుంచి వచ్చిన కొత్త చిత్రం “రైఫిల్ క్లబ్” (Rifle Club). నిజానికి ఈ చిత్రం గతవారం (డిసెంబర్ 19) విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అంటున్నారు. ఎందుకలా అంటున్నారు? అసలేముంది సినిమాలో? అనేది చూద్దాం..!!
కథ: ఈ కథ మొత్తం 1991లో జరుగుతూ ఉంటుంది. రొమాంటిక్ స్టార్ షాజహాన్ (వినీత్ కుమార్) ఒక యాక్షన్ సినిమా చేయాలనుకుంటాడు. అందుకోసం గన్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ట్రైనింగ్ తీసుకోవడానికి రైఫిల్ క్లబ్ కి వస్తాడు. ఆ క్లబ్ ని ఓ ఫ్యామిలీ మైంటైన్ చేస్తుంటుంది. లోనప్పన్ (విజయ రాఘవన్), అవరన్ (దిలీష్ పోతన్) నేతృత్వంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి జీవిస్తుంటారు.
కట్ చేస్తే.. మంగుళూరులో గన్స్ డీలర్ అయిన దయానంద్ (అనురాగ్ కశ్యప్) చిన్న కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ (నవని దేవానంద్) ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించడంతో పొరపాటున చంపేసి రైఫిల్ క్లబ్ కి వచ్చేస్తారు అలీ (రంజాన్ ముహమ్మద్). దాంతో.. దయానంద్ తన గ్యాంగ్ & గన్స్ తీసుకొని రైఫిల్ క్లబ్ కి వచ్చేస్తాడు. ఆ గ్యాంగ్ కి రైఫిల్ క్లబ్ ఎలా ఎదుర్కొంది? వీళ్లిద్దరి మధ్య జరిగిన తుపాకుల యుద్ధంలో చివరికి ఎవరు గెలిచారు? అనేది “రైఫిల్ క్లబ్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఇప్పటివరకు దిలీష్ పోతన్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే చూసాం. మొదటిసారి ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. చిన్నపాటి హ్యూమర్ కూడా తోడవ్వడంతో అతడి పాత్ర భలే ఎలివేట్ అయ్యింది. ఆ తర్వాత అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ వాణి విశ్వనాథ్ పోషించిన ఇట్టియాన్ పాత్ర. స్ట్రాంగ్ ఉమెన్ గా ఆమె క్యారెక్టర్లో ఇమిడిపోయిన తీరు బాగుంటుంది.
అలాగే.. సినిమా మొత్తం 15 పైగా క్యారెక్టర్ ఉన్నప్పటికీ దర్శన రాజేంద్ర, సురభి లక్ష్మి, ఉన్నిమాయ ప్రసాద్, విష్ణు అగస్త్య మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించారు. ఇక విలన్ గా మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనురాగ్ కశ్యప్ తనదైన శైలిలో హిందీ, మలయాళం, కన్నడ మాట్లాడుతూ విలనిజాన్ని వీరలెవల్లో పండించాడు. మరో కీలకపాత్రలో వినీత్ కుమార్ ఆకట్టుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఈ చిత్రానికి దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఒకడే కావడం విశేషం. ఆషిక్ అబు దర్శకత్వం కంటే ఛాయాగ్రహణం మీదే ఎక్కువ ధ్యాస పెట్టాడు. అందువల్ల ప్రతి ఒక్క ఫ్రేమ్, లైటింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను డిజైన్ చేసిన విధానం మరో లెవల్లో ఉంది. చాలా సింపుల్ & సింగిల్ లైన్ కథను హాలీవుడ్ వెస్ట్రన్ థీమ్ లో “రైఫిల్ క్లబ్”ను తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే.. చాలా సినిమాల్లో ఉమెన్ క్యారెక్టర్స్ ను జస్ట్ గ్లామర్ లేదా డైలాగ్స్ తో సరిపెట్టేస్తారు. కానీ.. ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ బ్లాక్ అన్నీ లేడీస్ కే పడడం అనేది మంచి కిక్ ఇస్తుంది. అయితే.. కథనం విషయంలో మరీ స్ట్రయిట్ స్క్రీన్ ప్లేకి వెళ్లకుండా, కాస్త కొత్తగా ఏమైనా ప్రయత్నించి ఉంటే యాక్షన్ బ్లాక్స్ తోపాటు కథ కూడా అలరించి ఉండేది.
సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. రైఫిల్ క్లబ్ ను డిజైన్ చేసిన తీరు, అందుకోసం వాళ్లకి దొరికిన లొకేషన్ భలే ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్ల లోపు అది కూడా క్యాస్టింగ్ తో కలిపి అంటే ఆశ్చర్యపోతాం. అలాగే.. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా గన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడా సహజత్వం మిస్ అవ్వలేదు. ఇక యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన సుప్రీం సుందర్ వీలినైంత వరకు లాజికల్ గా కంపోజ్ చేయడంతో ఎక్కడా ఫీల్ మిస్ అవ్వలేదు.
విశ్లేషణ: పోలోమని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ & ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ తో సినిమాల్ని నింపేస్తున్నారు ఈమధ్య. అలాంటిది క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కంటే కంటెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ను అలరించిన సినిమా “రైఫిల్ క్లబ్”. వాణి విశ్వనాథ్ ఆటిట్యూడ్, దిలీష్ పోతన్ క్యారెక్టర్, సుప్రీం సుందర్ డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్, ఆషిక్ అబు సినిమాటోగ్రఫీ & సీన్ కంపోజిషన్ టెక్నిక్స్, అనురాగ్ కశ్యప్ విలనిజం “రైఫిల్ క్లబ్”ను 2024లో బెస్ట్ మలయాళం సినిమాల లిస్ట్ లో చేర్చాయి.
ఫోకస్ పాయింట్: స్టైలిష్ యాక్షన్ సాగా!
రేటింగ్: 3/5