గత కొన్ని ఇండస్ట్రీలో షూటింగ్ ఏమీ జరగక ముసలం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై అటు నిర్మాతలు కానీ, ఇటు కార్మిక సంఘాలు కానీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే నిర్మాతలు ఒక మెట్టు దిగి 2000 రూపాయలు సంపాదించే కార్మికులకు 20% హైక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ.. కార్మిక సంఘాలు మాత్రం పెంచితే అందరికీ పెంచాలి కానీ, ఇలా మాత్రం చేయకూడదు అని భీష్మించుకొని కూర్చున్నాయి. దాంతో షూటింగ్ ఆగిపోయి ఇండస్ట్రీకి తీరని నష్టం వాటిల్లుతోంది.
ఇవాళ అదే విషయమై ఇండస్ట్రీలోని కొందరు యువ నిర్మాతలు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ బాధ వెళ్లగక్కుకున్నారు. ఎస్.కే.ఎన్, చైతన్య రెడ్డి, ధీరజ్ మొగిలినేని, శరత్, అనురాగ్, మధుర శ్రీధర్ రెడ్డి, రాజేష్ దండా తదితరులు పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ లో చిన్న సినిమా నిర్మాతల కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు.
మధుర శ్రీధర్ చెప్పిన పాయింట్ అందర్నీ ఆలోజింపజేసింది. ఇద్దరు ఆర్టిస్టులతో ఒక రూమ్ లో షూట్ చేసే సీన్ కి కూడా 40 మంది వర్కర్స్ అవసరం ఏముంటుంది? అని మధుర శ్రీధర్ ప్రశ్నించిన విధానం యూనియన్లు, అసోసియేషన్లు నిర్మాతలను ఎంత దారుణంగా దోచుకుంటున్నాయి అనే పద్ధతికి అద్దం పట్టింది. ఇదే సందర్భంగా ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ తాము 30% కాదు 50% పెంచుతాము కానీ.. ఈ యూనియన్లు మా థియేట్రికల్ & నాన్ థియేట్రికల్ బిజినెస్ కి బాధ్యత వహిస్తాయా? అని ప్రశ్నించారు.
పెద్ద నిర్మాతల విషయంలో ఈ రూల్స్ ఎలా పని చేస్తాయో తెలియదు కానీ.. చిన్న నిర్మాతలకు మాత్రం ఇది చాలా పెద్ద గుదిబండ అనే చెప్పాలి. మరి చిన్న నిర్మాతలందరూ ఏక తాటిన నిలబడి చాటుకున్న తమ స్వరాన్ని యూనియన్ పెద్దలు సీరియస్ గా తీసుకుంటారా? అసలు ఈ సమస్యకు ఎవరైనా పరిష్కారం చూపిస్తారా? అనేది చూడాలి.