ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నిర్మాతలు రెండు పెద్ద సినిమాల విడుదలకు మధ్య రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. భీమ్లా నాయక్ మూవీ విడుదలైన రెండు వారాల తర్వాత రాధేశ్యామ్ విడుదల కాగా రాధేశ్యామ్ విడుదలైన రెండు వారాల తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలైంది. పుష్ప, అఖండ సినిమాలు కూడా రెండు వారాల గ్యాప్ తో థియేటర్లలో విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. రెండు వారాల గ్యాప్ తో రిలీజ్ కావడం వల్ల పెద్ద సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. నైజాం ఏరియాలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు అందిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలైన రెండు వారాల తర్వాత థియేటర్లలో ఏప్రిల్ 8వ తేదీన గని రిలీజ్ కానుంది.
50 కోట్ల రూపాయల బడ్జెట్ తో గని తెరకెక్కగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కనీసం 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే ఈ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఆర్ఆర్ఆర్ కోసం భారీ మొత్తం ఖర్చు చేసిన ప్రేక్షకులు వెంటనే మరో సినిమాను చూసే మూడ్ లో లేరు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన భారీ అంచనాలతో కేజీఎఫ్2 రిలీజ్ కానుంది.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల ఎఫెక్ట్ గని సినిమాపై కచ్చితంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గని సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. గని మేకర్స్ నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.