తెలుగులో కూడా మల్టీ స్టారర్ చిత్రాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకూ ఓ స్టార్ హీరో.. మరొకరు సీనియర్ స్టార్ హీరో లేదా యంగ్ హీరో కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఇద్దరు ఒకే జనరేషన్ కు చెందిన స్టార్ హీరోలను పెట్టి… నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ తీస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ (సిరీస్) తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మొదట జూలై 30 2020 న విడుదల చేస్తున్నట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి అండ్ టీం వెల్లడించారు.
కానీ హీరోయిన్ ప్రాబ్లెమ్ అలాగే హీరోలకు గాయాలు అవ్వడంతో షూటింగ్ లేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది కూడా కుదరట్లేదు అని తెలుస్తుంది. గత సంవత్సరం ఎండింగ్ కి.. 70 శాతం షూటింగ్ పూర్తయ్యిందని ‘ఆర్.ఆర్.ఆర్’ టీం వెల్లడించింది. కానీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగన్ మాత్రం ఈమధ్యే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇది పక్కన పెడితే.. దసరాకి కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదంట. 2021 సంక్రాంతే టార్గెట్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ ను విడుదల చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సంక్రాంతికి విడుదయాలైన ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు రెండూ కలిపి 400 కోట్లు పైనే గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ ను కూడా సంక్రాంతికే విడుదల చేస్తే బెటర్ అనే ఉద్దేశంలో టీం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.