టర్కీలో వెళ్లిపోమాకే..

ఏ.ఆర్.రెహమాన్ స్వరాలకు గౌతమ్ మీనన్ దర్శకత్వం తోడైతే వెండితెరపై ఓ ప్రేమ కావ్యమే ఆవిష్కృత అవుతోంది. అందులో రొమాంటిక్ రుషిలాంటి అక్కినేని కుర్రాడు నాగచైతన్య నటిస్తే.. మరింత మధురమే. ‘ఏ మాయ చేసావే’తో ఈ ముగ్గురూ కలసి మాయ చేశారు. మళ్లీ వీళ్ల కలయికలో రూపొందుతున్న సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. మలయాళ భామ మంజిమ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ టర్కీలో జరుగుతుంది. ‘కన్నుల్లో నీవేగా.. నిలువెల్లా.. వెళ్లపోమాకే ..’ పాటను చిత్రీకరిస్తున్నారు. రెహమాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని ఈ జనవరిలో విడుదల చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. యాక్షన్, ప్రేమకథా చిత్రాలు తీయడంలో గౌతమ్ మీనన్ ది ప్రత్యేక శైలి. మాస్ మసాలా, కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా సినిమాలు తీస్తుంటారు. ఈ సినిమాతో కూడా కొత్త ట్రెండ్ సృష్టిస్తారని చిత్రబృందం చెబుతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసింది. కొన్ని కారణాల వలన చిత్రీకరణ అలస్యమైంది. ‘ఏ మాయ చేసావే’ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వాటిని సినిమా అందుకుంటుందని చిత్ర సమర్పకుడు, ప్రముఖ రచయిత కోన వెంకట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ యాక్షన్ హీరోగా సక్సెస్ కాని నాగచైతన్య ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రధమార్థం ‘ఏ మాయ చేసావే’ తరహాలో.. ద్వితీయార్థం కంప్లీట్ యాక్షన్ పంథాలో ఉంటుందట. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus