శేఖర్ కమ్ముల వద్ద దర్శకత్వ శాఖలో చేసి ‘వినాయకుడు’ సినిమాతో దర్శకుడిగా మారాడు సాయికిరణ్ అడివి. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మూడు విభిన్న పాత్రలు పోషిస్తూ ‘కర్మ’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు అడివి శేష్. ఇద్దరూ అన్నదమ్ములే (వరుసకు.. కజిన్స్ అన్నమాట). ప్రముఖ రచయిత అడివి బాపిరాజు మనవళ్ళైన వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. అది మొదలయినట్టే మొదలై పలు అడ్డంకులతో ఆగిపోతూ వస్తుంది.
దర్శకుడిగా ‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’ సినిమాలు చేసిన సాయి కిరణ్, తమ్ముడు శేష్ తెరకెక్కించిన ‘కర్మ’, ‘కిస్’ సినిమాలకు నిర్మాతగా, ప్రెజెంటర్ గా ఉండి చేతులు కాల్చుకున్నాడు. అయితే శేష్ నటుడిగా మంచి పేరు తెచ్చుకుని బిజీ అయ్యాడు. సాయికిరణ్ కూడా వాటి నుండి బయటపడి ‘కేరింత’ సినిమా పూర్తి చేసి తమ్ముడి కోసం కథ సిద్ధం చేశాడు. అప్పట్లో వీరిద్దరి కలయికలో ‘చిలిపి దెయ్యం’ పేరుతో ఓ రొమాంటిక్ డ్రామా తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. టైటిల్ విషయం బయటపెట్టకపోయినా సినిమా ఖాయమని ఇద్దరూ ధృవీకరించారు. ఆ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాత తర్వాత తప్పుకోవడంతో మళ్ళీ ఈ సినిమాకి బ్రేక్ పడింది.
తర్వాత శేష్ ‘క్షణం’ సినిమాతో రచయితగా, నటుడిగా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మళ్ళీ అతడిని నిర్మాతలు చుట్టుముట్టారు. దాంతో అన్న దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలెట్టాడు శేష్. అయితే ముందు చెప్పినట్టు ఇది రొమాంటిక్ డ్రామా కాదు థ్రిల్లర్ కథాంశం అని కొత్త మాట వినిపిస్తోంది. ఈ మేరకు కథ మారిందా.. లేక కథనం మార్చారా.. అసలిది ఇది థ్రిల్లరేనా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ అడివి బ్రదర్ నోరు విప్పాల్సిందే..!