బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ఐదు పదుల వయసు దాటినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. వరుస సినిమాలు అంగీకరిస్తూ బిజీ స్టార్ గా మారారు. ఆయన ఫిట్ నెస్ కి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయనకు కండల వీరుడు అనే బిరుదు వచ్చింది. బాలీవుడ్ లో ఆయనకు ఉండే క్రేజే వేరు. బీటౌన్ లవర్ బాయ్ గా అందరూ ఆయన్ను పిలుస్తుంటారు. అలాంటి సల్మాన్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట.
ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే నరాల రుగ్మతతో బాధపడినట్లు సల్మాన్ ట్యూబ్‌లైట్ అనే పాట ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. తాను ట్రైజెమినల్ న్యూరాల్జియా తీవ్ర నరాల బలహినతతో బాధపడ్డానని చెప్పారు. ఈ వ్యాధి వల్ల తను ఎక్కువ సేపు మాట్లాడలేకపోయేవాడినని.. మాట్లాడితే తన ముఖభాగం చాలా నొప్పి అనిపించి మూతీ వంకరపొతుందని అన్నారు.
బ్రష్ చేసుకున్నా.. మేకప్ వేసుకున్నా.. నొప్పి తీవ్రంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఇక రాత్రి సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడేవని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు.. దీని కోసం అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సల్మాన్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ట్రైజెమినల్ న్యూరాల్జియాను ఆత్మహత్య వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన అధిక శాతం మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారట. ఎందుకంటే ఈ వ్యాధి రోగులను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.