అనేక సినిమాల్లో అభిమానులు ఆశించిన దానికన్నా సమంత ఎక్కువగానే వినోదాన్ని పంచింది. ఈసారి అంత ఆశించకండి.. అంటూ చెబుతోంది. ఎందుకు ఆమాట చెప్పిందో.. వివరాల్లోకి వెళితే.. తెలుగులో యు టర్న్ సినిమాని కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ త్వరలోనే “నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనుంది. హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన నాలుగోసారి నటించబోతోంది. ఇక తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి శివ కార్తికేయ హీరోగా చేస్తోన్న “సీమరాజా”. ఇందులో సామ్ ఓ సరికొత్త పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె “సిలంబం” అనే విద్య నేర్పించే టీచర్‌గా నటిస్తోంది. ఇందుకోసం “సిలంబం” అనే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది.
ఇటీవలే ఈ సినిమాలోని ఓ లుక్ విడుదల చేయగా.. అందులో లంగా ఓణీతో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూసిన ఓ నెటిజన్ ఈ సినిమాలో సమంతది సుతంత్ర దేవి అనే సిలంబం టీచర్ పాత్ర అని, ఈ పాత్ర కోసం ఆమె దాదాపు మూడు నెలలు సిలంబంలో శిక్షణ తీసుకుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సమంత రియాక్ట్ అవుతూ..”అబ్బా.. నేను కేవలం 15 క్లాసులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. నా నుండి అంతకంటే ఎక్కువగా ఆశించకండి” అని ట్వీట్ చేసింది. “డైరెక్టర్ పొన్రాం మూడు నెలలు శిక్షణ తీసున్నారని చెప్పారు.. అందుకే మేము.. మీ నుంచి చాలా ఆశిస్తున్నాం” అంటూ ఆ నెటిజన్ మరో ట్వీట్ చేయడంతో సమంత “నో..” అని స్పష్టం చేసింది. సినిమాపై, పాత్రలపై భారీ అంచనాలు పెట్టుకుంటే వచ్చే నష్టాలు సమంతకి బాగా తెలుసుకాబట్టి అలా తక్కువగా చెప్పుకుంటోంది. సినిమాలో మాత్రం తప్పకుండా మెప్పిస్తుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.