మలయాళ సినిమా పరిశ్రమలో ఓ భారీ కుదుపునకు కారణమైన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై ప్రముఖ కథానాయిక సమంత (Samantha) తొలిసారిగా స్పందించింది. వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ కృషి వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని సమంత చెప్పుకొచ్చింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యూసీసీ కృషి చేస్తోందని ఆమె కొనియాడారు. కేరళలోని వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను.
ఆ టీమ్ చొరవ వల్లే జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న చిక్కులు, ఇబ్బందులను ఈ కమిటీ వెలుగులోకి తెచ్చింది. పని ప్రదేశాల్లో సురక్షితం, గౌరవం మహిళల కనీస అవసరాలు. వీటి కోసమే ఇప్పటికీ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించడంలేదు అని సమంత చెప్పుకొచ్చింద. కమిటీ రిపోర్టు వచ్చిన వళ.. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అని సమంత తన పోస్టులో పేర్కొంది.
ఇక వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న తన స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అని సమంత తెలిపింది. మలయాళ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో అనేక షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీంతో ఇతర చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా తమ పరిశ్రమలోని పరిస్థితుల్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నారు.
ఇక ఇప్పటివరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మాలీవుడ్‌లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి మోహన్ లాల్ (Mohanlal) రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి వైదొలిగింది. కమిటీలోని కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో కొత్త పాలక మండలి వస్తుందని సమాచారం.